తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే

తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే
  • మేం అధికారంలోకి వచ్చాక అన్ని కొలువులు భర్తీ చేస్తం

హైదరాబాద్: తెలంగాణ వస్తేనే మన కొలువులు మనకు దక్కుతాయని కొట్లాడిన యువకులు, నిరుద్యోగులను తెలంగాణ సర్కారు మోసం చేస్తోందని బీజేపీ యువజన మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ అన్నారు. టీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగ సమస్యలపై దృష్టి పెట్టలేదన్నారు. ఇటువంటి పాలన కోసమా తాము అత్మబలిదానాలు చేసుకుందని 1,200 మంది తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, కుటుంబానికి తాము భారం కాకూడదని దాదాపు 250 మంది యువకులు  ప్రాణాలు తీసుకున్నారన్నారు. నిరుద్యోగులకు అండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇందిరా పార్కులో ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టాలని పూనుకుంటే.. రాష్ట్ర సర్కారు కరోనా పేరుతో అనుమతి ఇవ్వలేదని భాను ప్రకాశ్ మండిపడ్డారు. 

‘రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా కల్వకుంట్ల వైరస్ ప్రమాదకరం. కొవిడ్ తో మరణించిన వారి కంటే కల్వకుంట్ల అరాచకాల వల్ల మరణించిన వారే ఎక్కువ. నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలె. గత ఎన్నికలకు ముందు నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ 36 నెలలు గడుస్తున్నా యువతకు రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం నిరుద్యోగులకు బాకీ పడిన రూ.1,05,560 భృతిని వెంటనే చెల్లించాలి’ అని భాను ప్రకాశ్ డిమాండ్ చేశారు. 

టీఆర్ఎస్ సర్కారుకు ఉరి వేయాలె

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భాను ప్రకాశ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువకులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఉరి వేసుకోవాల్సింది వాళ్లు కాదని.. టీఆర్ఎస్ సర్కారుకు ఉరి వేయాలని పిలుపునిచ్చారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న సర్కారు ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ప్రైవేటు, కార్పొరేట్ కొలువుల్లోనూ తెలంగాణ యువతకు పెద్ద పీట వేస్తామని వివరించారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎలక్షన్ కమిషన్నే రద్దు చేసిన్రు

పాములతో వీడియో షూట్.. సింగర్ ముఖంపై కాటేసిన సర్పం

రామ నామ స్మరణ చేయాలె.. ఒవైసీకి యూపీ మంత్రి సవాల్