
- రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకు పైగా పంట సాగు
- నిరుడే భారీగా నష్టపోయిన రైతులు.. మళ్లీ కనిపిస్తుండటంతో ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ఈ యేడాది కూడా రాష్ట్రంలో మిర్చి పంటలకు నల్లతామర వైరస్ విజృంభిస్తోంది. ఎన్ని పురుగుమందులు కొట్టినా తామర పురుగు మాత్రం చావట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుడు ఇదే తామరపురుగు దెబ్బకు పంటంతా దెబ్బతిని రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈయేడాది కూడా పూత, కాత దశలో ఉన్న మిర్చితోటల్లో నల్లతామర పురుగు ప్రత్యక్షం కావడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. నిరుడు చేసిన కష్టంపోగా పంటను పీకేసి మక్కలు, ఇతర పంట వేసిన రైతులు ఇప్పుడేంచేయాల్నా అని అయోమయంలో ఉన్నారు.
లక్షల్లో పెట్టుబడులు పెట్టి పంట సాగు..
మిర్చికి భారీగా డిమాండ్ ఉన్నందున ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి రైతులు పంట సాగు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 4 లక్షల ఎకరాలకుపైగా మిరపతోటలు వేశారు. గింజలు గ్రాముల లెక్క, నారును ఒక్కో మొక్కకు ఖరీదు కట్టి లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలు పెంచారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌తో పాటు, మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కేసముద్రం, గూడురు, డోర్నకల్, కురవి మండలాలు, ఖమ్మం జిల్లా పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కారేపల్లి కామేపల్లి, ఏన్కూరు, తల్లాడ మండలాలు, అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు, సుజాతనగర్, పాల్వంచ, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, బూర్గంపాడు, పినపాక, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాలు, ములుగు, సూర్యాపేట, నల్గొండ తదితర జిల్లాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేశారు. మార్కెట్‌లో మిర్చి పంటకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ.. పంట తెగులు బారిన పడి రైతుల ఆశలపై నీళ్లు జల్లుతోంది. రైతులకు ఎకరానికి రెండుమూడు క్వింటాళ్లు రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. తామర పురుగు వ్యాప్తి కాకుండా నిరుడు హార్టీకల్చర్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన చర్యలు ఫలించలేదు. జాతీయస్థాయి అధికారులు వచ్చి పరిశోధనలు చేశారు. అయినా సరైన మందులు సూచించిన దాఖలాలు లేవు. అందుబాటులో ఉన్న పలురకాల మందులు మార్చి కొట్టడం ద్వారా తామరపురుగు ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని అధికారులు సూచించారు. ఆ విధంగా పాటించినప్పటికీ పురుగు వ్యాప్తి మాత్రం ఆగలేదని రైతులు చెప్తున్నారు.
తక్కువ టైంలోనే పంటను తినేస్తయ్
తామర పురుగులు 25 నుంచి 30 వరకు గుంపులుగా ఉండి మిర్చి పూత, కాతను తినేస్తున్నాయి. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ సైజులో నల్లగా ఉండే ఈ పురుగు రోజుకు 150 గుడ్లు పెట్టి వేగంగా విస్తరిస్తోంది. తక్కువ టైమ్‌లోనే తోటలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఇండోనేషియా మిర్చీ సీడ్ ద్వారా వ్యాప్తి చెందిన ఈ వైరస్ బారిన పడిన పంటను వదిలేయడం తప్ప పురుగు నివారణ మాత్రం సాధ్యం కావట్లేదని రైతులు వాపోతున్నారు. వాతావరణంలో మార్పులు, చలి, మంచు కారణంగా పురుగు వేగంగా డెవలప్ అవుతోందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.