బాబ్​ వరల్డ్​ యాప్​ ఎపిసోడ్​తో.. మేలుకున్న ఇతర ప్రభుత్వ బ్యాంకులు

బాబ్​ వరల్డ్​ యాప్​ ఎపిసోడ్​తో..  మేలుకున్న ఇతర ప్రభుత్వ బ్యాంకులు

బిజినెస్​ డెస్క్, వెలుగు​:బాబ్​ వరల్డ్​ యాప్​ స్కామ్ బయటపడడంతో  కొన్ని  ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ డిజిటల్​యాప్స్​పై ఇంటర్నల్​ ఆడిట్స్​ చేపట్టినట్లు సమాచారం. తమ మొబైల్​ యాప్స్​ బలాలు, బలహీనతలు ఏమిటనేది తెలుసుకోవడం కోసమే ఈ ఇంటర్నల్ ఆడిట్​ నిర్వహిస్తున్నట్లు ఒక  ప్రభుత్వ బ్యాంకు సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు. తమంతట తాముగానే ఈ చొరవ తీసుకుంటున్నట్లు వివరించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇంటర్నల్ ఎగ్జామినేషన్​ చేపట్టామని, కొన్ని రోజులలోనే ఇది పూర్తవుతుందని ఆ ఆఫీసర్​ వెల్లడించారు. డిజిటల్​ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను తాము ఎక్కువగా చేర్చుకోవడంలేదని ఆయన తెలిపారు. సేఫ్​ బ్యాంకింగ్​ కోసం ఇలాంటి ఇంటర్నల్​ ఆడిట్స్​ను అప్పుడప్పుడు చేపట్టడం తమకు సాధారణమేనని మరొక పీఎస్​యూ బ్యాంకు సీనియర్​ ఆఫీసర్​ పేర్కొన్నారు. ఏదైనా కొత్త యాప్​ లేదా ఫీచర్​ తెచ్చినప్పుడు, చెక్స్​ను నిర్వహిస్తూనే ఉంటామని అన్నారు. ఏ విధమైన లోపాలు లేకుండా చూడాలనే ఆ చెకింగ్స్‌ ​చేస్తామని పేర్కొన్నారు. నాన్​–కాంప్లయెన్స్​విషయంలో రాజీ పడలేమని ఆ బ్యాంకు సీనియర్​ ఆఫీసర్​ వివరించారు. 

జులైలోనే మీడియా రిపోర్టులు...

 బ్యాంక్​ ఆఫ్​ బరోడా కస్టమర్ల ఖాతాలలో  ట్యాంపరింగ్​ జరుగుతోందని, ఇందులో బాబ్​ వరల్డ్​ యాప్​ పాత్ర ఉందని చెబుతూ  ఈ ఏడాది జులై నెలలోనే మీడియాలో రిపోర్టులు వచ్చాయి. మొబైల్​ అప్లికేషన్​ రిజిస్ట్రేషన్ల సంఖ్యను ఎక్కువ చేసి  చూపించేందుకు కస్టమర్లకు సంబంధం లేని ఫోన్ నెంబర్లతో వీరి అకౌంట్లను బ్యాంక్​ ఆఫ్ బరోడా లింక్​ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రిపోర్టుల కారణంగా 60 మంది ఉద్యోగులను బ్యాంక్​ తొలగించింది. ఇందులో 11 మంది అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​(ఏజీఎం) స్థాయి ఆఫీసర్లు కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏజీఎం లెవెల్​ ఆఫీసర్లంటే స్కేల్​ 5 కి చెందిన వారు. సాధారణంగా ఏరియా మేనేజర్లు, జోనల్​ హెడ్స్ గా వారు కార్యకలాపాలు నిర్వహిస్తారు. అంటే, వారి కింద 25 మంది బ్రాంచ్​ హెడ్స్​పనిచేస్తుంటారని బీఓబీ ఉద్యోగి ఒకరు చెప్పారు. బాబ్​ వరల్డ్​ యాప్​ కేసు ఆడిట్​ కారణంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు బ్యాంకు తన సస్పెన్షన్​ ఆర్డరులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.బాబ్​ వరల్డ్​ యాప్​ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి వీల్లేదని రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా ఆదేశించిన నేపథ్యంలో లోపాల సవరణకు చర్యలు మొదలు పెట్టామని బీఓబీ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. రెండు వారాలలో దీనిపై ఒక రిపోర్టును ఆర్​బీఐకి పంపించనున్నట్లు తెలిపారు. 

బాబ్​ వరల్డ్​పై ఆర్‌‌బీఐ గరం​....

తన మొబైల్​ బ్యాంకింగ్​ యాప్​ బాబ్​వరల్డ్​ ద్వారా కొత్త కస్టమర్లను ఆన్​బోర్డింగ్​ చేయడం ఆపేయమని ఈ నెల 10 వ తేదీన బ్యాంక్​ ఆఫ్​ బరోడా (బీఓబీ)ని  రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఆదేశించింది. ఈ ఆదేశాన్ని వెంటనే అమలులోకి తేవాలని బ్యాంకుకు సూచించింది. మొబైల్​ యాప్​ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునే ప్రాసెస్​లో కొన్ని లోపాలు బయటపడటం వల్లే పై విధమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆర్​బీఐ వెల్లడించింది. 

దేశంలో డిజిటల్​ పేమెంట్స్​ జోరు

దేశంలో డిజిటల్​ పేమెంట్స్​ జోరుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ సెగ్మెంట్లో పేటీఎం, ఫోన్​పే, గుగుల్​పేలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గ్లోబల్​ వెల్త్​ మేనేజ్​మెంట్​ కంపెనీ బెర్న్​స్టీన్​ సెప్టెంబర్​ నెలలో ఒక రిపోర్టులో వెల్లడించింది. కార్డుల వంటి ఇతర క్యాష్​లెస్​ పేమెంట్స్​ ఎదగడం ఇక కష్టమేనని ఆ రిపోర్టు పేర్కొంది. గత అయిదేళ్లుగా చూస్తే డెబిట్​ కార్డు లావాదేవీలు నిలకడగా తగ్గిపోతున్నాయని వివరించింది. రాబోయే అయిదేళ్లలో మొత్తం రిటైల్‌ డిజిటల్​ ట్రాన్సాక్షన్లలో 90 శాతం వాటాను యూపీఐ చేజిక్కించుకుంటుందని ఆర్​బీఐ తన  జూన్​ బులెటిన్​లో ప్రస్తావించింది.