సీసీటీవీ ఫుటేజ్: సిరియాలో బాంబు దాడి.. 40 మంది మృతి

సీసీటీవీ ఫుటేజ్: సిరియాలో బాంబు దాడి.. 40 మంది మృతి

సిరియాలోని ఆఫ్రిన్‌ పట్టణంలో మంగళవారం పెట్రోల్ ట్యాంకర్ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది పిల్లలతో సహా 40 మంది చనిపోయారు. దాదాపు 60 మంది గాయపడ్డారు. సిరియా కుర్దిష్ వైపీజీ మిలీషియా ఈ దాడికి కారణమని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆఫ్రిన్ పట్టణంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. ఈ దాడికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఒక వీడియోను కూడా పోస్టు చేసింది. ఆ వీడియోలో వరుసగా వెళ్తన్న వాహనాలు మనకు కనిపిస్తాయి. ఆ వాహనాలలో ఒక పెట్రోల్ ట్యాంకర్ కూడా ఉంది. వాహనాలు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈ పేలుడు జరిగింది. ఈ దాడిని అమెరికా ఖండించింది. ‘రంజాన్ ఉపవాసాలను విడవడానికి కాసేపటి ముందు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో సెంట్రల్ మార్కెట్లో చాలామంది ఉన్నారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ తెలిపారు.

ఇటువంటి దాడులు ఎంతమాత్రం అమోదయోగ్యం కాదని అమెరిక పేర్కొంది. సిరియాలో కాల్పుల విరమణ కోసం అమెరికా గతంలోనే పిలుపునిచ్చింది. ఈ దాడికి కారణమైన వైపీజీ ఉగ్రవాదులను ఉత్తర సిరియా నుంచి వెళ్లగొట్టడానికి సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. ఆఫ్రీన్ పట్టణాన్ని 2018లో వైపీజీ నుంచి టర్కీ మిలటరీ స్వాధీనం చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ బాంబు దాడి టర్కీ మద్ధతు ఉన్న ప్రాంతంలో జరిగింది.