వేల కోట్లతో ప్రాజెక్టులు కడ్తున్నా అందని సాగునీరు

వేల కోట్లతో ప్రాజెక్టులు కడ్తున్నా అందని సాగునీరు
  • గత ఏడాది 1.15 లక్షల కొత్త కనెక్షన్లు
  • తెలంగాణ వచ్చాక కొత్తగా 8.07 లక్షల కనెక్షన్లు

హైదరాబాద్, వెలుగు: వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నది. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెబుతున్నది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉన్నది. పంటలకు నీళ్ల కోసం రైతులు లక్షల రూపాయలు వెచ్చించి వ్యవసాయ బోర్లు వేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు అంతకంతకు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఎనిమిదేండ్లలో 8.07 లక్షల కొత్త వ్యవసాయ బోర్లకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా వేల సంఖ్యలో కొత్త కనెక్షన్ల కోసం రైతుల అప్లికేషన్లు డిస్కంల దగ్గర పెండింగ్‌‌లో ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. సాగు కోసమే రైతులు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్నారు. వరి కోసమే కాకుండా.. వర్షాలు పడని సమయంలో పత్తి, కంది వంటి చేన్లకు బోరు నీళ్లతోనే తడి పెడుతున్నారు.

ఏటా 85 వేల కొత్త బోర్లు
ఏటా యావరేజ్‌‌గా 85 వేల బోర్లకు కొత్త కనెక్షన్లు ఇస్తున్నారంటే ఏ స్థాయిలో రైతులు సొంత బోర్లు వేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. గతేడాదిలో 1.15 లక్షల బోర్లు వేసినట్లు డిస్కంల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాదిలో 37 వేల బోర్లకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు. మరో 60 వేల అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. అధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా నడిపిస్తున్న బోర్లు మరో 5 లక్షల దాకా ఉంటాయని అంచనా. ఉత్తర తెలంగాణ డిస్కం (ఎన్​పీడీసీఎల్​) కంటే దక్షిణ తెలంగాణ డిస్కం(ఎస్పీడీసీఎల్​)లో వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు పెరుగుతున్నాయి. రెండింటి మధ్యలో లక్షన్నరకు పైగా కనెక్షన్ల డిఫరెన్స్ ఉంది.

కరెంటు వినియోగంలో అగ్రికల్చర్ వాటా పెరుగుతున్నది
రాష్ట్రంలో ఏటా విద్యుత్‌‌ వినియోగం 65 వేల మిలియన్‌‌ యూనిట్ల (ఎంయూ)కు పైగా ఉంది. రోజు వారీగా గరిష్ట వినియోగం 285 ఎంయూలు ఉన్నది. కరెంట్ వినియోగంలో అగ్రికల్చర్ వాటా 40 శాతంగా ఉన్నది. వ్యవసాయ బోర్ల కనెక్షన్లు పెరుగుతుండటంతో గత రెండేళ్ల నుంచి ఇది మరింత పెరిగింది. వరి వంటి పంటలకు నిరంతరం బోర్లు నడిపిస్తుండటంతో కరెంట్​ వినియోగం పెరుగుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. వానాకాలం సీజన్‌‌లో వర్షాలు కంటిన్యూగా కురిస్తే అగ్రికల్చర్​కు విద్యుత్ డిమాండ్ కొంత తగ్గుతున్నది. అదే యాసంగిలో విపరీతమైన డిమాండ్ ఉంటున్నది.

ప్రాజెక్టుల నీళ్లు రాకనే
తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు రూ.2 లక్షల కోట్లను ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఇందులో కాళేశ్వరంతోపాటు పాలమూరు రంగారెడ్డి, మిషన్ కాకతీయ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 72 మేజర్, మీడియం ప్రాజెక్టులు ఉన్నాయి. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు అనేక వేదికల మీద ప్రకటించారు. కొత్తగా 20  లక్షల ఎకరాల ఆయకట్టు క్రియేట్ చేయడంతో పాటు 30.57 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ చేసినట్లు ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్ చెబుతున్నది. మొత్తంగా 90 లక్షల ఎకరాలు ఇరిగేషన్ పొటెన్షియల్ యుటిలైజేషన్ ఉన్నట్లు పేర్కొంటున్నది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రాజెక్టుల కాలువల ద్వారా నీరు సరిగ్గా అందడం లేదని తెలుస్తున్నది. సాగు నీళ్లు లేకపోవడంతోనే బోర్లు వేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఆఫీసర్లు, నిపుణుల ప్రకారం ఎలాంటి గ్యాప్ లేకుండా నడిచే బోరుతో కనీసం మూడు ఎకరాల వరి పంటకు నీరు పారుతుంది. ఇప్పుడున్న బోర్లతో 60 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరి పంటకు నీళ్లు అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందుతున్నట్లు చెప్తున్న లెక్కలు ఉట్టివేనని స్పష్టమవుతున్నది.