15 ఏళ్లకే పెళ్లి పీటలెక్కుతున్నఅబ్బాయిలు

15 ఏళ్లకే పెళ్లి పీటలెక్కుతున్నఅబ్బాయిలు

 

పెళ్లి చేసుకోవడానికి లీగల్​గా వయసు ఎంత ఉండాలి? బయటి దేశాల సంగతి ఏమో గానీ, మన దగ్గర మాత్రం మగవాళ్లకు 21, ఆడవాళ్లకు 18 ఏళ్లు ఉండాలి. కానీ, చదువుకునే వయసులోనే ఆ ముచ్చట తీర్చేసుకుంటున్నారు కోట్లాది మంది అబ్బాయిలు. అవును, ప్రపంచ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది అబ్బాయిలు 15 ఏళ్లకే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. 82 దేశాలపై పదేళ్లుగా యునిసెఫ్​ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రతి ఐదుగురిలో ఒకరు 15 ఏళ్లలోపే ఓ ఇంటివాడు అవుతున్నట్టు సర్వే తేల్చింది. తక్కువ లేదా ఓ మోస్తరు సంపాదన ఉన్న ఇళ్లలోనే ఈ ‘బాల వివాహాలు’ ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. అది కూడా ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువగా ఉంది. సెంట్రల్​ ఆఫ్రికన్​ రిపబ్లిక్​ 28 శాతం పెళ్లిళ్లతో టాప్​లో ఉంది. ఆ తర్వాత 19 శాతంతో నికరాగ్వా, 13 శాతంతో మడగాస్కర్​లున్నాయి. అమ్మాయిల విషయానికొస్తే ఇప్పుడు 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల్లో 18 ఏళ్లలోపే పెళ్లయిన వాళ్లు ప్రతి ఐదుగురిలో ఒకరున్నారని సర్వే చెప్పింది. అదే అబ్బాయిలైతే 30లో ఒకరున్నట్టు పేర్కొంది. మొత్తంగా ప్రపంచం మొత్తంలో 76.5 కోట్ల మందికి పెళ్లీడు రాకముందే పెళ్లిళ్లు అయిపోతున్నాయని పేర్కొంది. 2018లో బాల్య వివాహాలు 3 శాతం తగ్గినా, నంబర్లు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆడపిల్లల బాల్య వివాహాలకు సంబంధించి మెరుగైన చర్యలే తీసుకుంటున్నారని, ఇప్పుడు అబ్బాయిలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య పెళ్లి అవుతున్న అమ్మాయిలు 14.1 శాతం మంది. వాళ్లంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినోళ్లే. ఈ ఏడాది అది 51 శాతానికి తగ్గింది. బాల్య వివాహాలు పిల్లల బాల్యాన్ని లాగేసుకుంటోందని యునిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ హెన్రియెట్టా ఫోర్​ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చిన్నప్పుడే అబ్బాయిలకు పెద్దపెద్ద బాధ్యతలు అప్పగిస్తున్నారు. చిన్నతనంలోనే పెళ్లి చేయడం వల్ల వెంటనే తండ్రులవుతున్నారు. దాని వల్ల ఒత్తిడి పెరిగిపోతోంది. సరైన చదువు లేక, దానికి తగ్గ పని దొరక్క కుటుంబాన్ని పోషించడం గగనమైపోతోంది” అని హెన్రియెట్టా అన్నారు.