
- కర్నాటక కలబురగి జిల్లాలో బ్రాహ్మణ సంఘాల ధర్నా
బెంగళూరు: నీట్ ఎగ్జామ్ సందర్భంగా బ్రాహ్మణ విద్యార్థులు ధరించిన జంధ్యాన్ని తీసి వేయించడంపై బ్రహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆదివారం కర్నాటకలో కలబురగి జిల్లాలోని సెయింట్ మేరీ స్కూల్ సెంటర్‌లో ఈ సంఘటన జరిగింది. శ్రీపద్ పాటిల్ అనే విద్యార్థి జంధ్యాన్ని ధరించి పరీక్ష కేంద్రానికి వచ్చాడు. గేట్ వద్ద చెకింగ్‌లో భాగంగా అతను ధరించిన జంధ్యాన్ని సెక్యూరిటీ సిబ్బంది తొలగించారు.
ఈ విషయం తెలుసుకున్న పలు బ్రహ్మణ సంఘాలు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకొని, గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు మతపరమైన సెంటిమెంట్లను అగౌరవపర్చారని, ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసింది. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా సూచనలు చేసింది.
మరోవైపు, ఏప్రిల్ 16న జరిగిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) సమయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని ఆందోళనకారులు గుర్తుచేశారు. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.