సౌత్ కొరియాకు చెక్..క్వార్టర్స్ చేరిన బ్రెజిల్

 సౌత్ కొరియాకు చెక్..క్వార్టర్స్ చేరిన బ్రెజిల్

ఫిఫా వరల్డ్ కప్ 2022లో మాజీ ఛాంపియన్ బ్రెజిల్ జోరు కొనసాగుతోంది. అద్భుత ఆటతీరుతో నాకౌట్ చేరిన బ్రెజిల్..నాకౌట్ లో రెచ్చిపోయింది. తాజాగా ప్రిక్వార్టర్స్ లో సౌత్ కొరియాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో బ్రెజిల్ ఏకంగా 4–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 

ఆరంభంలోనే దూకుడు...

దక్షిణ కొరియాతో మొదలైన మ్యాచ్ ప్రారంభంలోనే బ్రెజిల్ గోల్ కొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఆట ప్రారంభమైన 7వ నిమిషంలోనే వినిషియస్ జూనియర్ మొదటి గోల్ కొట్టి జట్టుకు 1-0 తో ఆధిక్యాన్ని అందించాడు.  ఆ తర్వాత కొద్దిసేపటికే  బ్రెజిల్‌కు పెనాల్టీ దక్కింది. దీన్ని ఉపయోగించుకున్న నెయ్‌మార్  గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 29వ నిమిషంలో రిచార్లీ సన్ మరో గోల్ సాధించాడు. కాసేపటికే 36వ నిమిషంలో లూకాస్ పకూటా మరో గోల్ చేయడంతో  బ్రెజిల్ తొలి అర్థభాగంలోనే 4–0 గోల్స్ చేసి మ్యాచ్ పై స్పష్టమైన పట్టు సాధించింది. చివరకు తొలి అర్థభాగం గిసే సరికి 4–0తో  సౌత్ కొరియాపై బ్రెజిల్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. 

గోల్ చేసినా గెలవలేకపోయింది...

సెకండ్ హాఫ్‌లో బ్రెజిల్ జోరును కొనసాగించింది. గోల్స్ సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ సమయంలో పుంజుకున్న కొరియా... 76వ నిమిషంలో గోల్ కొట్టింది. కొరియా తరఫున సుంగ్ హో పాక్.. బాక్స్ బయటి నుంచి అద్భుతమైన షాట్‌తో గోల్ సాధించాడు.  ఆ తర్వాత కొరియా మరో గోల్ చేసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. చివరకు బ్రెజిల్4–1 తేడాతో గెలిచి ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 8వ సారి క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది.