అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

చెన్నూర్, వెలుగు: గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ.. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రకృతి వనాలు పచ్చదనం లేక వెలవెలబోతున్నాయి. సుమారుగా 1500 నుంచి 2 వేల వరకు మొక్కలు ఉండాల్సిన వనాల్లో పట్టుమని 300 మొక్కలు కూడా లేకపోవడంతో సందర్శకులు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈజీఎస్​ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోటపల్లి మండలం రాజారం గ్రామంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి తన ఎడ్లను పల్లె ప్రకృతివనంలో చెట్లకు కట్టేసి మేపుతున్నాడు. ఇలా ఎడ్లను మేపడం వల్ల ప్రకృతి వనంలోని చాలా చెట్లు విరిగిపోతున్నాయి.ఏదులబంధంలోని ప్రకృతి వనంలో మొక్కలు మోడువారి దర్శనమిస్తున్నాయి.  ఇప్పటికైనా ప్రకృతి వనాలపైన దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

కాంగ్రెస్​ ఆజాదీకా గౌరవ యాత్ర

ఆదిలాబాద్​టౌన్/జైపూర్/మందమర్రి/కాగజ్​నగర్/జన్నారం, వెలుగు: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆజాదీకా గౌరవ యాత్ర నిర్వహించారు. ఆదిలాబాద్​లో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్​ఖాన్, పీసీసీ లీడర్​ఓడినాల శ్రీనివాస్, భూపెల్లి శ్రీధర్,  జడ్పీటీసీ చారులత రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. జైపూరల్​లో జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. కాగజ్​నగర్​మండలం ఈజ్​గాంలో జరిగిన కార్యక్రమంలో లీడర్లు సుభాష్ చంద్రబోస్  విగ్రహానికి పూలమాలవేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ లీడర్లు రావి శ్రీనివాస్ , కోరళ్ల కృష్ణా రెడ్డి,  మరుసకోల సరస్వతి, గుండా శ్యామ్, దాసరి వెంకటేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగీర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ఉమ్మడి జిల్లా  వ్యాప్తంగా గిరిజనులు మంగళవారం ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి గుస్సాడీ నృత్యాలు చేశారు. కుమ్రంభీం విగ్రహానికి నివాళి అర్పించారు. పలువురు లీడర్లు మాట్లాడుతూ పోడుభూములకు పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు. ఉట్నూర్​లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్​ సిక్తా పట్నాయక్ ​ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు. ఆసిఫాబాద్​లో కలెక్టర్​ రాహుల్​రాజ్, అడిషనల్​కలెక్టర్​ చాహత్ ​బాజ్​పేయ్, జడ్పీ చైర్ ​పర్సన్​ కోవ లక్ష్మి గిరిజనులతో కలిసి స్టెప్పులేశారు. ఆదిలాబాద్ ​జడ్పీ మీటింగ్​ హాల్​లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కాగజ్​నగర్​లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ కుమ్రంభీం విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. జైనూర్​లో భీం మనుమడు కుమ్ర సోనేరావు భీం విగ్రహానికి పూలమాల వేశారు.

డయేరియాతో  వృద్ధురాలి మృతి

కాగజ్ నగర్, వెలుగు: డయేరియాతో వృద్ధురాలు మృతిచెందింది. బెజ్జూర్ మండలం సలుగు పల్లి గ్రామానికి చెందిన లచ్చుబాయి(70)  మూడు రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతోంది. హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఇది ఇలా ఉంటే గ్రామంలో మూడు రోజుల క్రితం కలుషిత నీరు సరఫరా కావడంతో సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను బెజ్జుర్, కాగజ్​నగర్​  పీహెచ్​సీల్లో చికిత్స పొందుతున్నారు.

బైక్ ర్యాలీ సక్సెస్ చేయండి

భైంసా,వెలుగు: హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఈ నెల12న  భైంసాలో నిర్వహించనున్న  బైక్ ర్యాలీని సక్సెస్​ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్​ రావు పటేల్​ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత పలు దుకాణాల్లో జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు సుభాష్ పటేల్, తాడేవార్​సాయినాథ్, కపిల్​ శింధే, దిలీప్, రామకృష్ణ, మాణిక్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి రక్షణ కోసం ఉద్యమించాలి

నస్పూర్,వెలుగు: సింగరేణి రక్షణ కోసం ఉద్యమించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. మంగళవారం శ్రీరాంపూర్ ఓసీపీ గనిపై ఏరియా ఉపాధ్యక్షుడు బరపటి మారుతి ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ  జోక్యంతో సంస్థలో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. వారసుల వయోపరిమితి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు పేరం రమేశ్, పొడిసెట్టి వినోద్ కుమార్, పెండం సత్యనారాయణ, అరుకాల ప్రసాద్, మాదాసు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మకుమారీస్​ ఆధ్వర్యంలో రక్షాబంధన్​

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాదీకా అమృత్​ మహోత్సవం, రక్షాబంధన్ నిర్వహించారు. కార్యక్రమానికి సబ్ జోనల్ ఇన్​చార్జి విజయ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఆధ్యాత్మిక చైతన్యంతో జీవించాలన్నారు. కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, బ్రహ్మకుమారీలు పద్మ, కైవల్య తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్​ అభివృద్ధికి నిధులు ఇవ్వండి

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రేఖానాయక్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కోరారు. ఈమేరకు మంగళవారం వారంతా హైదరాబాద్​లోని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణను కలిశారు. భారీ వర్షాలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, లీడర్లు పరిమి సురేశ్, నాయిని సంతోష్, షబ్బీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని పెత్తందారులు ఏలుతున్రు

బజార్హత్నూర్,వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టినట్లు డీఎస్పీ (దళిత శక్తి ప్రొగ్రాం) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చెప్పారు. మంగళవారం ఆయన బజార్​హత్నూర్​మండలం కోలారి, బజార్​హత్నూర్, ​గిర్నూర్, కాండ్లి, పిప్రి గ్రామాల్లో పర్యటించారు. రాష్ట్రంలో భూమి, రాజ్యం, సంపద కేవలం రెండు కులాల చేతుల్లోనే ఉందన్నారు. పేదలు అధికారంలోకి వచ్చినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. బహుజనుల ఓట్లతో అధికారంలోకి వస్తున్న దొరల పాలనకు చరమతీతం పాడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్, గణేశ్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, మండల అధ్యక్షుడు నరేశ్ ​తదితరులు  పాల్గొన్నారు.

బాస్కెట్​ బాల్​ పోటీలకు ఎంపిక 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని డీవైఎస్​వో గ్రౌండ్​లో మంగళవారం జిల్లా స్థాయి బాస్కెట్​ బాల్​ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చాటినవారు ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఇదే గ్రౌండ్​లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. బాలుర విభాగంలో అగస్టీన్, సచిన్, సంజయ్, శ్రీవర్ధన్, ముస్తఫా, రాహుల్, అభిలాష్, రోహిత్, గణేష్, సాకేత్​ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో అర్చన, అక్షిత, శ్రీవల్లి, రమ్య, వర్షిత, అక్షర, తేజస్విని, వైష్ణవి, అంజలి, జలని, కకోన్, ముస్కాన్​ ఎంపికయ్యారు. బాస్కెట్​ బాల్​ అసోసియేషన్ జిల్లా చైర్మన్ గాజుల ముఖేష్​గౌడ్,  అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్​గౌడ్, సుకుమార్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.

వజ్రోత్సవాల్లో అందరూ పాల్గొనాలి

నిర్మల్,వెలుగు: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఎస్పీ ప్రవీణ్ కుమార్ కోరారు. మంగళవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు16న ఉదయం 11 గంటలకు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలపాన ఉంటుందన్నారు. 11న జిల్లా కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఫ్రీడం వాక్​నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ కిరణ్ ఖారే, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్​బీ ఇన్​స్పెక్టర్​రమేశ్, టౌన్ సీఐ శ్రీనివాస్  పాల్గొన్నారు.

జాతీయ జెండా ఎగుర వేయాలి

నస్పూర్,వెలుగు: జిల్లాలో ఈనెల 13 నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరు తమతమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి కోరారు. మంగళవారం ఆయన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలు అందజేశారు. కార్యక్రమంలో లీడర్లు సత్రం రమేశ్, ఈర్ల సదానందం, సమ్రాజ్ రమేశ్, మనోహర్, జంగంపల్లి మహేశ్, కొంతం మహేందర్, కోరెపు మహేందర్, భీమేశ్, సతీశ్​గౌడ్, రణధీర్, సాంబ శివ, రాజ్ కుమార్, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.