ఉమ్మడి మహబూబ్ నగర్ సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ సంక్షిప్త వార్తలు
  • అప్పుడు ఉండమన్నరు ఇప్పుడు పొమ్మంటున్నరు
  • వర్షాలలో ఇండ్లు కోల్పోయిన వారికి ‘డబుల్​’ ఇండ్లలో ఆశ్రయం
  • జూన్​లో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయిన 20 కుటుంబాలు
  • అప్పుడు డబుల్​ బెడ్​ రూం ఇండ్లల్లో ఉంచిన ఆఫీసర్లు
  • ఇప్పుడు అనధికారికంగా ఉంటున్నారని, ఖాళీ చేయమంటూ వేధింపులు

మహబూబ్​నగర్, వెలుగు: డబుల్​బెడ్​ రూమ్​ఇండ్లలో ఉంటున్న నిరాశ్రయులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖాళీ చేయకుంటే కేసులు పెడతమని పోలీసులను తీసుకొచ్చి వార్నింగ్​లు ఇస్తున్నారు. జూన్​లో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులమయ్యామని, ఆ టైంలో ఆఫీసర్లు, లీడర్లే ఇక్కడ ఉండమన్నారని, సడెన్​గా ఇప్పటికిప్పుడు ఇండ్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లి బతకాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​ మున్సిపల్​పరిధిలోని సిద్ధాయిపల్లి గ్రామ శివారులో 5 ఎకరాల స్థలంలో 2018లో డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణం కోసం పనులు చేపట్టారు. మొత్తం రూ.14 కోట్లతో ‘జీ ప్లస్ టు’ 288 ఇండ్లను కట్టారు. ఈ యేడు జూన్​4న ఈ బిల్డింగ్స్​ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ముందుగా మహబూబ్​నగర్​– -భూత్పూర్​ఫోర్​లైన్​రోడ్డు విస్తరణలో భాగంగా అమిస్తాపూర్​లో ఇండ్లు కోల్పోయిన 42 మంది బాధితులకు లక్కీ డిప్​ ద్వారా  పట్టాలను, ఇంటి తాళాలను స్థానిక ఎమ్మెల్యే అందజేశారు. ఆ తర్వాత ఇంత వరకు ఎవరికీ పట్టాలను పంపిణీ చేయలేదు. అయితే, జులై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు అమిస్తాపూర్​, సిద్ధాయిపల్లి, నల్లగుట్ట తండా ప్రాంతాల్లో  20 కుటుంబాలకు చెందిన వారి ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులోనే వారు ఉంటుండటంతో ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉందని స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు, అధికార పార్టీ లీడర్లు వీరిని ‘డబుల్’​ ఇండ్లలో నివాసం ఉండాలని చెప్పారు. సొంతంగా వెహికల్స్​ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వీరిని ఖాళీ చేయాలని ఆఫీసర్లు వత్తిడి తెస్తున్నారు. ఇటీవల రెవెన్యూ ఆఫీసర్లు పోలీసులతో వచ్చి బాధితులు ఖాళీ చేయాలని ఆర్డర్లు ఇచ్చి వెళ్లారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లకు తాళాలు పగులగొట్టారు. ఇదేమిటని బాధితులు ప్రశ్నిస్తే ఇండ్లను ఖాళీ చేయకుంటే కేసులు పెడతామని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. 

అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు

మున్సిపాలిటీలోని కొందరు అధికార పార్టీ లీడర్లు ‘డబుల్’ ఇండ్ల కోసం పైసలు వసూల్​చేసి ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. రూ. 2. 5 లక్షలకు ఇండ్లు ఇప్పిస్తమని ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కొందరు  రెండో విడతలుగా డబ్బులు చెల్లించేలా అగ్రిమెంట్​కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. అందుకే పోలీసుల సాయంతో బాధితులను ఖాళీ చేయించాలని ప్లాన్​చేస్తున్నారని వాపోతున్నారు. 

‘డబుల్’ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నా.. 

వర్షాల వల్ల సర్వం కోల్పోయి నిరాశ్రయులైన  బాధితుల్లో కొందరు 5 నెలల కింద, మరికొందరు ఆరు నెలల కింద ‘డబుల్’ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు వీరికి పట్టాలు ఇవ్వలేదు. వర్షాల వల్ల గతంలో వీరు నివాసం ఉన్న ఇండ్లు కూలిపోయాయి. కొందరి గుడిసెలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కానీ, పరిహారం కూడా రాలేదు. వ్యవసాయ పనులు చేసుకునే తమను సడెన్​గా పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని  బాధితులు కన్నీరు పెడుతున్నారు. 

కాళ్లు మొక్కినా మాట వినలే..

5 నెలల కింద మస్తు వానలు పడ్డయ్. మా ఇల్లు ఉరుస్తుంటే అధికారులు వచ్చి పరిశీలించి  ‘డబుల్’ ఇంట్లోకి తీసుకొచ్చి ఇక్కడే ఉండమన్నారు. మొన్న ఆఫీసర్లు వచ్చి ఇండ్లు ఖాళీ చేసి పొమ్మంటున్నరు. ఇండ్లను మీ కోసం కట్టించినమా అని దబాయించింన్రు. 
- నేనావత్​లక్ష్మి, నల్లగుట్టతండా, భూత్పూర్​ మండలం

అనధికారికంగా ఉంటున్నరు 

ఆఫీసర్లు ఎవరినీ బెదిరించలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన బాధితులను కలెక్టర్ ఆదేశాలతో ​ ‘డబుల్’​ ఇండ్లలోకి తరలించాం.  ఇదే ఆసరాగా కొందరు అనధికారికంగా  వచ్చి ఇండ్లకు తాళాలు వేసుకున్నట్లు కలెక్టర్ కు తెలిసింది.  ఆయన ఆదేశాల మేరకు  ‘డబుల్’ ఇండ్లను పరిశీలించి అర్హత లేని వారిని ఖాళీ చేయమని చెప్పాం. ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారికి  త్వరలోనే డిప్​ప్రకారం కేటాయిస్తాం.  
- తహసీల్దార్, భూత్పూర్​

టెన్త్‭లో వంద శాతం రిజల్ట్స్​ సాధించాలి: కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పదోతరగతి పరీక్షల్లో బెస్ట్​రిజల్ట్స్​సాధించి, జిల్లాను అగ్ర స్థానంలో నిలిపేందుకు ఆఫీసర్లు కృషి చేయాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన చాంబర్​లో   టెన్త్​స్టూడెంట్లకు 90 రోజుల పాటు బోధించే స్పెషల్​క్లాస్​ల కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ రోజూ ఉదయం, సాయంత్రం ఒక గంట స్పెషల్​క్లాసులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. 2023 మార్చి నెలలో టెన్త్​ఎగ్జామ్స్​ఉంటాయని చెప్పారు. జిల్లాలో 245 హైస్కూల్స్​ఉండగా..  ఈ అకడమిక్​ఇయర్​లో టెన్త్​ఎగ్జామ్స్​రాసే స్టూడెంట్ల సంఖ్య 10వేల 31 మంది ఉన్నారన్నారు. అన్ని గవర్నమెంట్​, ప్రైవేట్​అన్ని స్కూళ్లలో పక్కాగా క్లాసులు నిర్వహించి వారి సందేహాలను తొలగించి బోర్డు ఎగ్జామ్​భయం పోగొట్టాలన్నారు.  డీఈవో గోవిందరాజులు, డీఆర్డీఏ పీడీ నర్సింగరావు,  ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, సెక్టోరల్ ఆఫీసర్​వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

పదేళ్లు దాటితే ఆధార్ ఆప్ డేట్ చేసుకోవాలి

ఆధార్​కార్డు తీసుకుని పదేళ్లు దాటితే అప్​డేట్ చేసుకోవాలని  కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం తన చాంబర్ లో ఆధార్  అప్​డేట్​చేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డ్, స్కాలర్​షిప్​,  ఇన్​కం ట్యాక్స్,  బ్యాంకు లోన్లు, ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు కింద ఎక్కడైనా సరుకులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి
అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, గర్భిణులకు క్రమం తప్పకుండా టెస్టులు చేయాలని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శనివారం ఆయన రెవెన్యూ మీటింగ్ హాల్​లో వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ  అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. చిన్న పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు, బరువు తక్కువ ఉన్న పిల్లల ఆరోగ్యాన్ని పెపొందించేందుకు  వైద్యారోగ్య, ఐసీడీఎస్​ ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.  అంగన్​వాడీ  కేంద్రాలలో పిల్లలకు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో పరిమాణం తక్కువగా ఉన్న గుడ్లు ఇవ్వొద్దన్నారు.  నాణ్యత లేని సరుకులు పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  డాక్టర్లు  ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్​సీలో అందుబాటులో ఉండాలన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్ శశికాంత్, జిల్లా సంక్షేమ శాఖాధికారి జరీనా బేగం, డీఐవో డాక్టర్ శంకర్, పీహెచ్​సీల డాక్టర్లు పాల్గొన్నారు.

అభివృద్ధి చేస్తున్నందుకే ఆదరణ: ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

గండీడ్, వెలుగు:  టీఆర్ఎస్​ ప్రభుత్వం కమిట్​మెంట్​తో అభివృద్ధి పనులు చేస్తున్నందుకే పార్టీకి మంచి ఆదరణ వస్తోందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. శనివారం గండీడ్ మండలంలోని వెన్నచెడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ  నుంచి భారీగా టీఆర్ఎస్​లో చేరారు.  వారికి మహేశ్​రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్​పార్టీలో భారీగా చేరుతారన్నారు. అంతకు ముందు వెంకట్ రెడ్డి పల్లి గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. తర్వాత గండీడ్ మండల కేంద్రంలోని బాయ్స్​హైస్కూల్​లో డైనింగ్ హాల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, టీఆర్ఎస్​మండల అధ్యక్షుడు భిక్షపతి , పెంట్యా నాయక్ పీఏసీఎస్​వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బావిలో జారిపడి మహిళ మృతి

అడ్డాకుల, వెలుగు:  మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం ప్రమాదవశాత్తు బాయిలో జారిపడి చనిపోయింది. ఎస్సై విజయకుమార్ వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన రేణుక(35)  నోముల పూజ అనంతరం గ్రామ శివారులో ఉన్న గంగుల వాళ్ల బావిలో నోముల నీళ్లు పారబోసేందుకు వెళ్లింది. బావి అంచువద్ద నిలబడి నీళ్లు పారబోస్తుండగా.. కాలుజారి అందులో పడిపోయింది. రేణుక వెంట వెళ్లిన కుమారుడు గమనించి గ్రామంలోకి వెళ్లి  చెప్పడంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులను పిలిపించి బాయిలోని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై తెలిపారు. 

ట్రాక్టర్ రొటేవేటర్‭లో పడి యువ రైతు మృతి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తెలకపల్లి మండలం.. చిన్న ముద్దునూరు గ్రామంలో శనివారం  ఓ యువ రైతు తన పొలం దున్నుతూ ట్రాక్టర్ రొటేటర్ లో పడి చనిపోయాడు. ఎస్సై ప్రదీప్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగిశెట్టి శేఖర్ (20) ట్రాక్టర్​ రొటేవేటర్​ తో  పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు జారి రొటేటర్​లో పడ్డాడు. తీవ్రగాయాలై స్పాట్​లోనే చనిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్సై పంచనామ నిర్వహించి, కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం నాగర్ కర్నూల్ జనరల్  ఆస్పత్రికి తరలించారు.  

పోడుభూముల సర్వే ను పూర్తి చేయాలి
కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

వనపర్తి, వెలుగు: పోడు భూములకు పట్టాలు జారీ చేసేందుకు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వేను వేగంగా పూర్తి చేసి ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా  అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి మండలంలోని పెద్దగూడెం తండా పోడు భూములను, ఆన్ లైన్ డేటా నమోదును  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సర్వే బృందాలు  క్షేత్రస్థాయిలో ఆర్వోఎఫ్ఆర్ మొబైల్ యాప్ ద్వారా పూర్తి స్థాయిలో నమోదు చేయాలన్నారు. పెద్దగూడెం తండాలో పోడు రైతుల నుంచి 230 అప్లికేషన్లు అందాయని, 417 ఎకరాల పోడు భూమిని సర్వే చేసి , 113 దరఖాస్తులు పరిశీలించామన్నారు. మండలంలో మొత్తం 1,897  అప్లికేషన్లు స్వీకరించామని, 3,558 ఎకరాల భూమి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.  పోడురైతులు నష్టపోకుండా చూసే బాధ్యత ఆఫీసర్లపై ఉన్నదని సర్వే  పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రామకృష్ణ, ట్రైబల్ అధికారి శ్రీనివాస్,  తహసీల్దార్​రాజేందర్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

లింగాల, వెలుగు : మండలంలోని అవుసలికుంట గ్రామానికి చెందిన వడ్డె చంద్రయ్య(58)  కుటుంబ కలహాలతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.  పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..  చంద్రయ్య భార్యతో గొడవ పడి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో  కుటుంబ సభ్యులు గ్రామంలో గాలించగా.. గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు.   మృతుడి కుమారుడు సాయి కంప్లైంట్ ​మేరకు కేసు ఫైల్ ​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి  తెలిపారు.

రాష్ట్రంలో సాగునీరు, కరెంట్​ ఫుల్:మంత్రి శ్రీనివాస్​గౌడ్​

మహబూబ్​నగర్​, వెలుగు : రాష్ట్రంలో సాగునీరు, కరెంటు ఫుల్​గా ఉండడంతో రైతులు ఏటా 3 పంటలు పండించుకుంటున్నారని, దీంతో భూముల విలువ కూడా పెరిగిందని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా రూరల్​మండలంలోని కోట కదిర వద్ద ఏర్పాటు చేసిన వడ్ల  కొనుగోలు కేంద్రాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గతంలో రైతు సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం రైతుల బాగు కోసం ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మన్యంకొండ దేవాలయ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కమ్యూనిటీ హాల్, కొండపైన 18 గదులు నిర్మాణంలో ఉన్నాయని, నెల రోజుల్లో వీటిని పూర్తి చేయాలని మంత్రి ఆఫీసర్లను ఆదేశించారు. మరో రూ.1.34 కోట్లతో రెండు షెడ్లు, నరసింహస్వామి దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కేరళలోని పలని మాదిరిగానే మన్యంకొండ గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.  అడిషనల్​కలెక్టర్ కె. సీతారామరావు, డీఎస్​వో బాలరాజు, సివిల్​సప్లై మేనేజర్​ జగదీశ్​ పాల్గొన్నారు. కాగా, క్షయ వ్యాధి నిర్మూలనకు కలసికట్టుగా కృషి చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్​నగర్ క్యాంపు ఆఫీస్​లో  శనివారం ఉదయం ఆయన క్షయ బాధితులకు హెల్త్ కిట్లను అందజేశారు. ప్రస్తుతం క్షయ నివారణకు ప్రభుత్వం ఖరీదైన మందులు ఫ్రీగా సరఫరా చేస్తోందని గుర్తు చేశారు.ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకొని 6 నెలలు మెడిసిన్​వాడితే వ్యాధి తగ్గిపోతుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ మహేశ్, ప్రోగ్రామ్ ఆఫీసర్​రఫీక్, జిల్లా టీబీ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి

మరికల్, వెలుగు: వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్​ తో ఈ నెల 10 నుంచి వాల్మీకులందరూ జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని  స్టేట్​ జాయింట్​యాక్షన్​కమిటీ మెంబర్​ మధుసూధన్​బాబు కోరారు. శనివారం నారాయణపేట జిల్లా వాల్మీకుల మీటింగ్​మరికల్​లోని తిరుమల ఫంక్షన్​హాల్​లో నిర్వహించారు. హాజరైన ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఇది వరకు పాలించిన పార్టీలు, ప్రస్తుత పార్టీలన్నీ మోసం చేశాయన్నారు.  ఇప్పటికైనా అందరం కలిసి కట్టుగా పార్టీలకతీతంగా పోరాటం చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.  నాయకులు రాములు, టీకే కురుమన్న, హరిశంకర్​నాయుడు, గడ్డంపల్లి నర్సిములు, గట్టు కృష్ణ, చంద్రప్ప, రాములు తదితరులు పాల్గొన్నారు.

క్లోరో హైడ్రైట్​ స్వాధీనం..?

జడ్చర్ల టౌన్​, వెలుగు: జడ్చర్ల ఎక్సైజ్​పరిధిలోని భూత్పూర్​ సమీపంలో  శనివారం రాత్రి భారీగా​  సీహెచ్​(క్లోరో హైడ్రైట్​​)​ను  ఎక్సైజ్​ అధికారులు  పట్టుకున్నట్లు సమాచారం.  కాగా సదరు విషయమై ఎక్సైజ్​ సీఐ బాలాజీని సంప్రదించగా విచారణ కొనసాగుతోందని, ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు. కాగా కేటీదొడ్డి మండలానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు   వెహికల్​లో వెళ్తూ మరో వెహికల్​లో సీహెచ్​ను తరలిస్తుండగా  ఆఫీసర్లు దాడులు చేసి వెహికల్​ను సీజ్​ చేసినట్లు తెలిసింది.

లక్షల మందికి కేంద్రం మెరిట్​ స్కాలర్​షిప్​లు

ఆమనగల్లు, వెలుగు: దేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, అందు కోసం రాష్ట్రం నుంచి స్టూడెంట్లు భారీ సంఖ్యలో  నేషనల్​ మెరిట్​స్కాలర్​షిప్​లకు సెలెక్ట్​కావాలని నేషనల్​బీసీ కమిషన్​మాజీ  సభ్యుడు ఆచారి సూచించారు. శనివారం ఆమనగల్ పట్టణంలోని గర్ల్స్​హై స్కూల్​స్టూడెంట్లకు యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో  రెడ్డి ఫౌండేషన్ సహకారంతో సమకూర్చిన స్టడీ మెటీరియల్​ను ఆయన స్టూడెంట్లకు  అందజేశారు. అంతకుముందు మున్సిపాలిటీలోని 9వ వార్డులోని గవర్నమెంట్​ఆస్పత్రిలో మిషన్ భగీరథ నల్లాను, సీసీ రోడ్డును మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్యలతో కలిసి ఆచారి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన లక్షమంది  స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.1,000 చొప్పున నాలుగేళ్లపాటు స్కాలర్​షిప్​ఇస్తోందన్నారు. ఎంపీటీసీ కుమార్, కౌన్సిలర్లు లక్ష్మణ్, చెన్నకేశవులు, విజయకృష్ణ, సోనా జయరాం, బీజేపీ లీడర్లు నరసింహ, శ్రీశైలం యాదవ్, ఎంపీహెచ్​వో తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
అడిషనల్​ కలెక్టర్ మోతిలాల్  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వడ్లకొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించి రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని అడిషనల్​కలెక్టర్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక సుఖజీవన్​ఫంక్షన్ హాల్​లో వడ్ల కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను  ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలన్నారు.  వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో పైసలు పడే విధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వడ్లను రైతుల వద్దనే కొనుగోలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను దళారుల వద్ద కొనుగోలు  చేయవద్దని హెచ్చరించారు. అలాంటి వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు.  జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్​మోహన్ బాబు, సివిల్ సప్లై  డీఎం బాలరాజు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కో ఆపరేటివ్​ఆఫీసర్​పత్యా నాయక్, డీఆర్డీఏ పీడీ నర్సింగ్ రావు, మార్కెటింగ్ అధికారిణి బాలామణి, ఆర్టీవో ఎర్రిస్వామి పాల్గొన్నారు. 

రైస్​మిల్లర్లకు చేయూతనందిస్తాం: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 

గద్వాల టౌన్, వెలుగు: రైస్ మిల్లర్లకు, రైస్ మిల్ అసోసియేషన్ కు అన్ని విధాల చేయూతనందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం హరిత హోటల్లో జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శేఖర్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి శీలా అశోక్, ట్రెజరర్​ సుదర్శన్ లతో పాటు ఇతర కమిటీ కార్యవర్గ సభ్యులను  సన్మానించి ప్రమాణం చేయించారు. రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్ అసోసియేషన్ల కన్నా గద్వాల రైస్ మిల్ అసోసియేషన్ గొప్ప పేరు తెచ్చుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ బీఎస్​కేశవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాములు గౌడ్, పాండు, మురళి పాల్గొన్నారు. 

స్కూల్ నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు: డీఈవో గోవిందరాజులు 

కల్వకుర్తి, వెలుగు: స్కూల్స్​నిర్వహణ సరిగా లేకపోతే కఠిన చర్యలు  తప్పవని నాగర్​కర్నూల్​ డీఈవో గోవిందరాజులు అన్నారు. శనివారం కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ ప్రైమరీ, హైస్కూళ్లను డీఈవో విజిట్​చేశారు. తర్నికల్ హైస్కూల్​లో మిడ్​ డే మీల్స్​రిజిస్ట్రర్​ నిర్వహణ సరిగా లేకపోవడం, క్యాష్ బుక్ మెయింటెయిన్​ చేయకపోవడం లాంటి తప్పులు చేయడంతో డీఈవో షోకాజ్ ​నోటీస్​ఇచ్చారు. 3 రోజుల్లో క్లారిఫికేషన్​ ఇవ్వకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. 

‘పేట’కు పాలిటెక్నిక్​ కాలేజీ: ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి

నారాయణపేట, వెలుగు:  జిల్లాకు వ్యవసాయ పాలిటెక్నిక్​కాలేజీ శాంక్షన్​అయిందని ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి తెలిపారు. శనివారం క్యాంప్​ ఆఫీస్​లో ఆయన మాట్లాడుతూ..  ‘పేట’ ప్రజల తరఫున సీఎం కేసీఆర్ కు​విన్నవించిన వెంటనే కాలేజీ శాంక్షన్​చేశారని, అది కూడా ఇదే  అకడమిక్​ ప్రారంభించుకోవడానికి  అవకాశమిచ్చారని చెప్పారు.  అంతేకాకుండా ధన్వాడ మండలానికి  డిగ్రీ కాలేజీని శాంక్షన్​చేశారన్నారు. ఇలా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, లీడర్ల తరఫున సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్​రెడ్డి, టీఆర్ఎస్​పట్టణ అధ్యక్షుడు విజయ్​సాగర్ తదితరులు పాల్గొన్నారు.