ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కొడిమ్యాల, వెలుగు: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయని, చేసిన పనిదినాలకు అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని కలెక్టర్ రవికి ఉపాధిహామీ కూలీలు బుధవారం ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి విలేజ్ లో సుమారు 240 మంది కూలీల వేతనాలు, అకౌంట్ లల్లో జమ కాలేదని, ఎన్ని సార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే అక్రమాలను గుర్తించి తమ వేతనాలను అకౌంట్ లో జమ చేయాలని కోరారు.

ప్రజల వద్దకే ఆరోగ్య సేవలు

చందుర్తి, వెలుగు: ప్రజల వద్దకే ఆరోగ్య సేవలు అందిస్తున్నామని ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు. బుధవారం మల్యాల లో ప్రతిమ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిమ సంచార ఆరోగ్య రథం ద్వారా ప్రజలకు ఉచితంగా ఎక్స్ రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, కార్డియాక్ ప్రొఫైల్, మినీ లాబరేటరీ లాంటి సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. యూత్ కి ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి మండలానికి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ లను ప్రతిమ ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు మార్త సత్తయ్య, పొంచెట్టి రాకేశ్, లోకోజు సతీశ్​తదితరులు పాల్గొన్నారు. 

గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
    
జగిత్యాల, వెలుగు : జిల్లాకేంద్రంలో నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష కోసం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్​రవి అధికారులను ఆదేశించారు. బుధవారం అడిషనల్​కలెక్టర్ బి.ఎస్.లతతో కలిసి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు జరిగే కేంద్రాలలో ఫర్నిచర్, సీసీ కెమెరాలతో పాటు పరీక్ష రాసే అభ్యర్థులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. వారి వెంట ఆర్డీఓ మాధురి, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మార్వో ఆరీఫ్ పాల్గొన్నారు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

 మల్లాపూర్, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్యంపేట, రాఘవాపేట, సిరిపూర్, కుస్థాపూర్ గ్రామాల్లో  రూ.7.89లక్షల విలువ కలిగిన 28 చెక్కులకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ నగేశ్, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, మాజీ జడ్పీటీసీ ముత్తమ్మ, సర్పంచులు
 పాల్గొన్నారు.

రెండువారాల్లో పోడు దరఖాస్తుల వెరిఫికేషన్

సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు: పోడు భూములపై హక్కులు కల్పించాలని వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ను రెండు వారాల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, పంచాయితీ రాజ్, అటవీ శాఖ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​మాట్లాడారు. జిల్లాలో 66 గ్రామాలకు చెందిన ప్రజల నుంచి 14,031 ఎకరాలపై హక్కులు కల్పించాల్సిందిగా కోరుతూ 5,940 క్లైమ్ లు వచ్చాయని తెలిపారు. ఫారెస్ట్ కింద తక్కువగా భూమి ఉన్నందున పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఎమ్మార్వోలు క్షేత్ర పరిశీలన చేయాలన్నారు. భూమిలేని పేదలకు హక్కులు కల్పిస్తూనే, రిజర్వ్ డ్ అటవీ భూములకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓలు  శ్రీనివాసరావు, పవన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘ఎల్లంపల్లి’తో జలాశయాలకు మహర్దశ
   
గంగాధర, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టుతో నారాయణపూర్, పోతారం జలాశయాలకు మహర్దశ పడుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం సాగునీటి కాలువల పెండింగ్ పనులపై బూరుగుపల్లిలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపారు. పెండింగ్​లో ఉన్న డీ1, డీ2 కెనాల్ పనులు పూర్తి చేసి, కాళేశ్వరం అదనపు టీఎంసీ కాలువ తవ్వకానికి భూసేకరణ చేయాలన్నారు.  నారాయణపూర్, చర్లపల్లి(ఎన్​), మంగపేట ముంపు బాధితులను త్వరగా గుర్తించాలని సూచించారు. అనంతరం బంగారు బతుకమ్మ పాట షూటింగ్​ను ప్రారంభించారు. సమీక్షలో ఇరిగేషన్ సర్కిల్ ఎస్​ఈ జి.అశోక్​కుమార్, ఈఈలు ఎం.సుధాకిరణ్,  శ్రీనివాస్​రావు గుప్తా  పాల్గొన్నారు. 

ఆధార్ ఎన్​రోల్​మెంట్ పూర్తి చేయాలి

 తిమ్మాపూర్, వెలుగు:  పోషణ్ ట్రాకర్ యాప్ లో అంగన్​వాడీ కేంద్రంలోని పిల్లల ఆధార్ ఎన్​రోల్​మెంట్ను వంద శాతం పూర్తి చేయాలని కరీంనగర్ ఇన్​చార్జి జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత సూచించారు. పోషణ మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎల్ఎండీ కాలనీ దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సెంటర్ పరిధిలోని గర్భిణులకు సామూహిక సీమంతాలతోపాటు పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పోషణ అభియాన్ ప్రతిజ్ఞ నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ సరస్వతి, తిమ్మాపూర్ సూపర్​వైజర్ శ్రీలత, సూపర్వైజర్స్ రాజశ్రీ, వెంకటలక్ష్మి, ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు. 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

మల్లాపూర్, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్యంపేట, రాఘవాపేట, సిరిపూర్, కుస్థాపూర్ గ్రామాల్లో  రూ.7.89లక్షల విలువ కలిగిన 28 చెక్కులకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ నగేశ్, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, మాజీ జడ్పీటీసీ ముత్తమ్మ, సర్పంచులు
 పాల్గొన్నారు.

ఎంసీహెచ్​​ సిబ్బందిపై ఆఫీసర్ ​విచారణ

జగిత్యాల, వెలుగు: జిల్లా కేంద్రం లోని మాతా,శిశు హాస్పిటల్ లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు తీరుపై ఈనెల 21న ‘వీ6 వెలుగు’లో ప్రచురితమైన ‘ఎమ్మెల్యే తో ఫోన్ చేయిస్తవా’ కథనానికి హెల్త్ డిపార్ట్​మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి స్పందించారు. రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పెర్సి అనే గర్భిణి ప్రసవం కోసం వెళ్తే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై జైపాల్​రెడ్డి స్పందించారు. బుధవారం ఏంసిహెచ్ లో పలువురు వైద్యులను, సిబ్బందిని విచారణ చేసి వివరాలు తెలుసుకున్నారు. 

పెండింగ్ పనులు పూర్తి చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు:  జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఎస్పీ ఆఫీస్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఐజీపీ విక్రమ్ మాన్ సింగ్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో నిర్మాణంలో ఉన్న ఎస్పీ ఆఫీస్​ను ఆయన పరిశీలించారు. ప్రజలకు సత్వర పోలీస్ సేవలు అందించేందుకు అన్ని హంగులతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం జిల్లా పోలీస్ కార్యాలయాలను సముదాయాన్ని నిర్మిస్తోందన్నారు. పనుల్లో స్పీడ్ పెంచాలన్నారు. ఎస్పీ ఛాంబర్, గ్రీవెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర రూమ్ లని పరిశీలించారు. ఆయన వెంట తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఎస్పీ చేతన్ శర్మ, సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్ ఎస్పీ చందయ్య, డీఎస్పీలు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, సీఐలు అనిల్ కుమార్ తదితరులు
 ఉన్నారు. 

సీసీ కెమెరా పగులగొట్టాడు.. హార్డ్​ డిస్క్​ మరిచాడు
   
కొడిమ్యాల, వెలుగు: షాప్ లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ కౌంటర్లో ఉన్న క్యాష్ కొట్టేసి తనను గుర్తు పట్టడానికి వీలు లేకుండా సీసీ కెమెరాలు ధ్వసం చేశాడు. కానీ హార్డ్ డిస్క్ మర్చిపోవడంతో దొరికిపోయాడు. ఎస్ఐ వెంకట్ రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో బాపురెడ్డి అనే వ్వక్తికి చెందిన దుకాణంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. రూ.35 వేల నగదును ఎత్తుకెళ్లిన దొంగ తనను ఎవరూ గుర్తు పట్టకూడదని సీసీ కెమెరాలను పగులగొట్టి వెళ్లిపోయాడు. కానీ హార్డ్ డిస్క్ లో మాత్రం అతడు చోరీ చేసిన దృశ్యాలతో పాటు అతడి ముఖం కూడా రికార్డ్ అయ్యింది. హార్డ్ డిస్క్ లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.

ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల నిరసన

గోదావరిఖని, వెలుగు: జర్నలిస్టులకు ఇళ్లు, ప్రెస్ క్లబ్ లకు స్థలాలు ఇచ్చి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. అనంతరం రామగుండం మండల తహసీల్దార్ ఎండీ జావీద్​ పాషాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వీఆర్ఏల నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం.వంశీ, కోశాధికారి దయానంద్ గాంధీ, ఉపాధ్యక్షులు పి.శ్యామ్ సుందర్, కేఎస్.వాసు, సురభి శ్రీధర్, సమ్మయ్య, శంకర్, రామగుండం మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

‘మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు’

గంగాధర, వెలుగు: పత్తి పంట సాగులో మోతాదుకు మించి ఎరువులు వాడొద్దని బీసీఐ ప్రాజెక్ట్ యూనిట్ మేనేజర్ పి.సాయికుమార్ అన్నారు. బుధవారం గంగాధర మండలం ఉప్పరమల్యాల జీపీ వద్ద  రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.  పంటసాగులో మిత్ర పురుగుల గుర్తింపు, ఆరోగ్యకరమైన పత్తి పంట సాగు, సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన పురుగుమందులు మాత్రమే వాడాలన్నారు. సమావేశంలో ఫీల్డ్ ఫెసిలిటేటర్ ఎన్​.శ్రీనివాస్, సర్పంచ్ మంజుల-, రైతులు కరుణాకర్​రెడ్డి, తిరుమల్​రెడ్డి, రాజిరెడ్డి, వీరారెడ్డి, గంగయ్య, నర్సయ్య పాల్గొన్నారు. 

అవాస్తవాలు మాట్లాడటం పొన్నంకు తగదు

కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణభివృద్ధికి కృషి చేస్తున్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ గురించి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అవాస్తవాలు మాట్లాడటం తగదని మేయర్ వై.సునీల్ రావు అన్నారు. బుధవారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నపుడు కరీంనగర్ ను పట్టించుకోని వ్యక్తి, పట్టణాభివృద్ధి కోసం అహర్నిశలు తపించే వినోద్ కుమార్ ను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నేషనల్ హైవే 563కు ఒక్క రూపాయి నిధులు తీసుకురాని అసమర్థుడు, అవాకులు చెవాకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందనిఆరోపించారు. అనంతరం స్థానిక 18వ డివిజన్ రేకుర్తిలో రూ.1.2కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు మాధవి, వనజ, రమణారావు, సాగర్, ఐలేందర్ యాదవ్, జయశ్రీ, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాస్తారోకో

గోదావరిఖని, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ లీడర్ కౌశిక హరి, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడారు. కార్మికులు సమ్మె చేస్తుంటే కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యాజమాన్యం మొండి వైఖరిని వీడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏఐటీయూసీ నాయకులు ఎల్లా గౌడ్ ఆధ్వర్యంలో జీడీకే 1వ గని వద్ద కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు.