మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : చేపల వేటకు వెళ్లి అన్నదమ్ములు చనిపోయారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల ఆర్అండ్ఆర్ సెంటర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... చింత్రియాల వీఆర్ఏగా పనిచేస్తున్న సైదాహుస్సేన్ కుమారులు సద్దాం (15), సమీర్ (12) ఏపీలోని చిలుకలూరిపేటలో చదువుకుంటున్నారు.
ప్రస్తుతం రంజాన్ సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చారు. మంగళవారం సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంట్లో చెప్పకుండా సమీపంలోని కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు పడవపై వెళ్లారు. పిల్లలిద్దరూ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలింపు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో కృష్ణా నది ఒడ్డున పిల్లల చెప్పులు కనిపించడంతో నదిలోకి వెళ్లి ఉంటారని భావించి స్థానికులతో కలిసి గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో అధికారులకు సమాచారం ఇవ్వగా.. బుధవారం ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు నది వద్దకు వచ్చి గాలిస్తుండగా.. ఇద్దరు డెడ్‌బాడీలు దొరికాయి.
