- భూమి ఇచ్చిన మాకే డబుల్ ఇల్లు కేటాయించాలి
- రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ వద్ద దళితుల ధర్నా
- డబుల్ ఇండ్లు కట్టిస్తామంటూ దళితుల నుంచి 10 ఎకరాలు తీసుకున్న బీఆర్‌ఎస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : డబుల్ ఇండ్లు కట్టిస్తామని స్థలం తీసుకొని, పూర్తైన ఇండ్లను ఇప్పుడు వేరేవారికి కేటాయిస్తుండడంతో భూమి ఇచ్చిన వారు ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ వద్ద గురువారం రోడ్డుపై బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే... సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని 261, 262, 257, 249 సర్వే నంబర్లలో 1984లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ 50 ఇండ్లను నిర్మించి దళితులకు ఇచ్చింది. మిగతా స్థలంలో కొందరికి ఓపెన్ ప్లాట్లు కేటాయించింది. ఆ ఇండ్లు శిథిలం కావడంతో డబుల్ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ బీఆర్ ఎస్ సర్కార్ దళితుల నుంచి పది ఎకరాల భూమిని తీసుకొని 204 ఇండ్లను నిర్మించింది.
భూమి ఇచ్చిన ప్రతి దళితుడికి డబుల్ ఇల్లు ఇస్తామని, ఇందుకోసం 100 ఇండ్లను కేటాయిస్తామని అప్పట్లో కేటీఆర్ , మున్సిపల్ ఆఫీసర్లు, పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. డబుల్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న టైంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎంపిక నిలిచిపోయింది. ప్రస్తుతం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయిస్తున్నారని ప్రచారం కావడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇండ్ల వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఇండ్లు తమకే కేటాయించాలంటూ భూమి ఇచ్చిన దళితులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి సుమారు రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఆర్డీవో రమేశ్ , ఇతర ఆఫీసర్లు అక్కడికి వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.