బోర్డులు పెట్టిన్రు.. వదిలేసిన్రు!

బోర్డులు పెట్టిన్రు.. వదిలేసిన్రు!
  •     భద్రాచలం మన్యంలో క్రీడాప్రాంగణాల దుస్థితి
  •     జిల్లా వ్యాప్తంగా 673 వరకు క్రీడాప్రాంగణాల ఏర్పాటు!
  •     ఒక్కో ప్రాంగాణానికి రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు 
  •     కానీ అందులో ఇప్పటికీ కానరాని వసతులు 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం మన్యంలో క్రీడాప్రాంగణాల ఏర్పాటులో గత ప్రభుత్వం అపహాస్యం పాలైంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామపంచాయతీల్లో 673 వరకు క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్కోదానికి  గరిష్ఠంగా రూ.2లక్షలు, కనిష్ఠంగా రూ.50వేలతో ఈ క్రీడా ప్రాంగణాలను నిర్మించింది. కానీ అందులో వసతులు కల్పించడంలో విఫలమైంది.

ఊరికి బయట, గుట్టల్లో రాళ్ల కుప్పల్లో బోర్డులు పెట్టి ఇవే క్రీడాప్రాంగణాలు అని క్రీడాకారులను దగా చేసింది. ఆర్భాటాలకే తప్ప ఆచరణలో శూన్యం అని ఇప్పుడు ఆ ప్రాంగణాల్లోని కలుపు మొక్కలే రుజువు చేస్తున్నాయి. చర్ల  మండలం లక్ష్మీకాలనీ పంచాయతీలో గుట్టల్లో బోర్డు పెట్టి ఇదే క్రీడాప్రాంగణం అంటూ నమ్మబలికారు. కనీసం అక్కడ ఆడుకోవడానికి ఎలాంటి పరికరాలు లేవు.

ఇదే మండలంలోని తేగడలో బోర్డు పెట్టి క్రీడాప్రాంగణం అని చెప్పారు. కానీ అందులో కొందరు ప్రైవేటు వ్యక్తులు కొబ్బరి మొక్కలు నాటారు. గుండాలలోని క్రీడాప్రాంగణంలో  కలుపు మొక్కలు దర్శనమిస్తున్నాయి. నిధులు నిరుపయోగమయ్యాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  క్రీడాప్రాంగాణాల్లో కనీస వసతులు కల్పించి క్రీడాకారులకు అందుబాటులోకి తీవాలని పలువురు కోరుతున్నారు.