రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టి .. 98 వేల ఎకరాలకు నీళ్లు

రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టి .. 98 వేల ఎకరాలకు నీళ్లు
  • కాళేశ్వరంపై సీఈ సుధాకర్​రెడ్డి పవర్​పాయింట్ ప్రజెంటేషన్​
  • సర్కారు, కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ కుంగింది: విజిలెన్స్​ డీజీ రాజీవ్ రతన్ 

జయశంకర్‌‌ భూపాలపల్లి, మహదేవ్‌‌పూర్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ నిర్మాణానికి ఇప్పటిదాకా చేసిన ఖర్చు, ఎత్తిపోసిన నీళ్లు, పారిన ఆయకట్టు పై గత బీఆర్ఎస్ పాలకులు చెప్పిన లెక్కల్లో డొల్లతనం బయటపడింది. దీనిపై తాజాగా మేడిగడ్డ వద్ద సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా సమక్షంలో ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ఇచ్చారు. ఇటీవల జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడైన విషయాలపై ఎన్​ఫోర్స్ మెంట్ డీజీ రాజీవ్ రతన్ సవివరంగా చెప్పారు. ముందుగా ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి ​ప్రజెంటేషన్ ఇచ్చారు. 

2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం16.40 లక్షల ఎకరా లకు నీళ్లు ఇచ్చేందుకు రూ.37,500 కోట్లతో ప్రాణహిత– చేవెళ్ల పనులు చేపట్టిందన్నారు.  తెలంగాణ ఏర్పడ్డాక గత బీఆర్ఎస్​ ప్రభుత్వం​19.63 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో రూ.80 వేల కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టారన్నారు. రోజు 2 టీఎంసీల పంపింగ్​కోసం రూ.44,614 కోట్లు, అడిషనల్ టీఎంసీ కోసం రూ.17,051 కోట్లు మొత్తంగా రూ.61,665 కోట్లు అప్పుగా తెచ్చి ప్రాజెక్టు పనులు స్టార్ట్​ చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి, 98,570  ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు చెప్పారు.  

మరో రూ.33,459 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. 2019 జులై 21న మాజీ సీఎం కేసీఆర్ బ్యారేజీ ప్రారంభించారని, నాటి నుంచి ఇప్పటి వరకు 162.36 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్టు చేశామని సీఈ సుధాకర్​రెడ్డి స్పష్టం చేశారు. ప్లానింగ్, కన్​స్ట్రక్షన్, మెయింటనెన్స్ లోపం వల్లే బ్యారేజీ కుంగినట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించిందని వివరించారు. 

ఏడాదికే సీసీ బ్లాక్​లు కొట్టుకపోయినయ్​..

విజిలెన్స్​ఎన్​ఫోర్స్​మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఎంక్వైరీలో వెల్లడైన విషయాలపై ప్ర జెంటేషన్ ఇచ్చారు. ‘మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభించిన ఏడాదికే సీసీ బ్లాక్​లు కొట్టుకు పోయాయి. బ్యారేజీ నిర్మాణం కోసం ఏర్పా టు చేసిన కాఫర్ డ్యామ్​ను తొలగించకపోవ డం వల్ల బ్యారేజీకి భారీ నష్టం జరిగింది. 2020 మే 18, 2021 ఫిబ్రవరి 17న, 2022 ఏప్రిల్ 6న బ్యారేజీ పరిస్థితిని గమనించిన ఇరిగేషన్ ఇంజినీర్లు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. సర్కారు గానీ, ఎల్​అండ్​టీ సంస్థ గానీ రిపేర్లు చేయలేదు. దీనివల్లే బ్యారేజీ కుంగిందన్నారు. 

ఎస్ఎస్ఏ రూల్స్, డ్యామ్స్​సేఫ్టీ యాక్ట్ నిబంధనలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ పాటించలేదు’ అని ఆయన తెలిపారు. 2016 ఏప్రిల్​లో రూ.2,591 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకోగా, 2021 సెప్టెంబర్ నాటికి అంచనా వ్యయాన్ని రూ.4613 కోట్లకు పెం చేశారని చెప్పారు. పనులు పూర్తిచేయకుండానే మేడిగడ్డ బ్యారేజీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలతో త్వరలో పూర్తి నివేదిక  అందజేస్తామని రాజీవ్​ రతన్​ తెలిపారు.