కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం : హరీశ్​రావు

కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం :  హరీశ్​రావు

 

  • రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి పునాదులు వేసినం: హరీశ్ 
  • కాళేశ్వరం కింద తెచ్చిన లోన్ డబ్బులు పాలమూరు ప్రాజెక్టుకూ వాడినం
  • ప్రభుత్వ వైట్ పేపర్ మొత్తం తప్పుల తడక 
  • ఇది శ్వేతపత్రమా? లేక హామీల ఎగవేతపత్రమా? 
  • కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అవసరాలు, భవిష్యత్తు తరాల కోసమే అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించే ప్రయత్నం చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ‘‘రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది. మేం అప్పులు తెచ్చినా తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పరపతిని పెంచినం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, బీమారు రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది” అని మండిపడ్డారు. ‘‘మీరన్నట్టు రాష్ట్రం అప్పులకుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. ఇక మీ తెలివితేటలతో నిధులు తీసుకురండి. గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. మాపై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్ పేపర్ పై చర్చ సందర్భంగా బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన వైట్ పేపర్ మొత్తం తప్పుల తడకగా ఉందని విమర్శించారు.

 ‘మీరు విడుదల చేస్తున్నవి శ్వేతపత్రాలా? లేక మీరిచ్చిన హామీల ఎగవేతపత్రాలా?’ అనే అనుమానం కలుగుతున్నదని కామెంట్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు, ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతోనే ఎగవేతలకు, కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేతపత్రాల ఆంతర్యమని విమర్శించారు. ‘‘ఈ మొత్తం రిపోర్టు చూస్తే ఏ అంశాల్లో గత ప్రభుత్వాన్ని తప్పు పట్టొచ్చు? ఏ అంశాల్లో మెరుగ్గా ఉన్నట్టు చూపించవచ్చు? అన్న విధంగా తమకు కన్వినెంట్‌గా ఉన్న దాన్ని బట్టి సర్కార్ నివేదిక రెడీ చేయించినట్లు కనిపిస్తున్నది. గత పదేండ్లలో చాలా రంగాల్లో ప్రగతి సాధించినం. అనేక విషయాల్లో మెరుగ్గా ఉన్నాం. కానీ వాటిని ఈ రిపోర్టులో చూపించలేదు. 2014లో మేము అధికారంలోకి వచ్చిన నాడు మీరు ఖాళీ చిప్ప చితికిచ్చారని నిందలేస్తూ కూర్చున్నామా? తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో పని చేశాం. పగతనాన్ని పక్కన బెట్టి, పనితనంతో అభివృద్ధి వైపు నడిపించినం. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినం” అని అన్నారు. కాగా, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పేరిట బోర్లకాడ, బాయిల కాడ మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అదనంగా 0.5 శాతం రుణాలు తీసుకోవచ్చనే నిబంధనను కేంద్రం విధించిందని హరీశ్ రావు అన్నారు. ఇలా అప్పు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ ఒప్పుకోలేదని చెప్పారు. దీనిపై మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి కలుగజేసుకుని.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు కరెంట్ బిల్లులు వసూలు చేస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. 

ఆంధ్రా అధికారులతో రిపోర్టు తయారు చేయించిన్రు..  

కాళేశ్వరంపై వెంటనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందన్నారు. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ‘‘కాళేశ్వరం కార్పొరేషన్‌ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశాం. సీఎం రేవంత్‌ రెడ్డి పాత గురుశిష్యులు ఈ శ్వేతపత్రాన్ని వండివార్చారు. సస్పెండ్‌ అయిన ఏపీ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారు” అని ఆరోపించారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పగా.. అవసరమైతే తయారు చేసినవాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా రిటైర్డ్‌ అధికారులతో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. అప్పు, జీఎస్‌డీపీ నిష్పత్తిని చూపకుండా అప్పు, రెవెన్యూ రాబడిని చూపించారని అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యయంలో తెలంగాణ వాటా కింద 1956–57 నుంచి 2013–14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారని మండిపడ్డారు. అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్నారు. 

కార్పొరేషన్ల అప్పులు.. ప్రభుత్వ అప్పులెట్ల అయితయ్?  

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించి, పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకున్నామని హరీశ్ చెప్పారు. సంపద సృష్టించి ఆస్తులు కూడబెట్టామన్నారు. వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగా చిత్రీకరించి గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘కార్పొరేషన్లు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ మాత్రమే ఇస్తుంది. పౌరసరఫరాల కార్పొరేషన్‌ కు రూ.56 వేల కోట్ల అప్పులుంటే, అవి ప్రభుత్వ అప్పులుగా చూపించారు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి 48 గంటల్లో డబ్బులు చెల్లించడానికి బ్యాంకుల నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తాత్కాలికంగా రుణాలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఎఫ్‌సీఐ నుంచి డబ్బులు రాగానే, తిరిగి బ్యాంకులకు చెల్లింపులు చేస్తుంది. అదే విధంగా విద్యుత్‌ కార్పొరేషన్‌ విషయం పరిశీలిస్తే.. సంస్థ తీసుకున్న రుణాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించడం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం లాంటి పనులు చేస్తుంది. విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంస్థ తిరిగి ఆ రుణాలను చెల్లిస్తుంది” అని అన్నారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తే రైతుల నుంచి, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనేదేనా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఉద్దేశం? అని ప్రశ్నించారు.

అప్పులు చూపించి ఆస్తులు దాచిన్రు..

కేవలం అప్పులు చూపించి, ఆస్తులు దాచారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘ఎంతసేపు అప్పులు అప్పులని నాణేనికి ఒకవైపే చూపించారు. నాణేనికి రెండోవైపు ఆస్తులు పెరిగాయి. అది మాత్రం దాచిపెడుతున్నారు. సాధారణంగా అప్పులను డెడ్‌ టు జీఎస్‌డీపీ రేషియో చూస్తాం. కానీ ఈ టేబుల్‌ను ఇందులో పెట్టకుండా డెడ్‌ టు రెవెన్యూ రిసిప్ట్‌ను చూపించారు. జాతీయంగా అయినా, అంతర్జాతీయంగా అయినా అప్పులను డెడ్‌ టు జీఎస్‌డీపీ రేషియోలో కొలుస్తారు. కానీ ఇందులో ఆ టేబుల్‌ను ఎక్కడా చూపించలేదు. అది కూడా ఒక కరోనా సంవత్సరాన్ని తీసుకుని.. దాని ప్రకారం చూపించే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిదేండ్లలో 3,36,916 కోట్ల రూపాయల క్యాపిటల్‌ ఎక్సపెండిచర్‌ జరిగింది. కానీ దీన్ని ఆ రిపోర్టులో చూపించేలేదు” అని ఫైర్ అయ్యారు.  

పీసీసీ అధ్యక్షుడిగానే రేవంత్ మాటలు..  

సీఎం రేవంత్​ రెడ్డి సభా నాయకుడిగా కాకుండా గాంధీ భవన్​ లో పీసీసీ చీఫ్​గా మాట్లాడుతున్నారని హరీశ్ విమర్శించారు. ‘‘అసెంబ్లీలో అలా మాట్లాడటం సరికాదు. కాళేశ్వరంపై రాహుల్ గాంధీ, రేవంత్ తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు. ఇప్పుడు కాళేశ్వరం థర్డ్​ టీఎంసీ కలిపి రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారని అని చెబుతున్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికే గ్యారంటీ ఇచ్చామే తప్ప ఆ డబ్బులను ప్రభుత్వానికి వాడలేదు. విద్యుత్​సంస్థల అప్పుల గురించి మాట్లాడటం కాదు. మేం సృష్టించిన ఆస్తుల గురించి కూడా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని రోజులు చర్చ పెట్టినా మేం సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం” అని అన్నారు.

పొన్నం వర్సెస్ ​హరీశ్..​

కేంద్రం నుంచి రావాల్సిన  రూ.లక్ష కోట్లు రాకపోవడం వల్లనే ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగిందని హరీశ్ అన్నారు. ఎస్‌వీపీలను అప్పులుగా తప్పుగా చూపించారని ఫైర్ అయ్యారు. ఏ ప్రభుత్వం వద్ద డబ్బులు కట్టల రూపంలో బీరువాల్లో ఉండవని అన్నారు. కాగా, హరీశ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటూ గోబెల్స్‌ ప్రచారం చేశారని, ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారని మంత్రి మండిపడ్డారు.