మన టెక్నాలజీతోనే  4 జీలో దూసుకెళ్తాం

మన టెక్నాలజీతోనే  4 జీలో దూసుకెళ్తాం

న్యూఢిల్లీ నెక్స్ట్​ జనరేషన్​ నెట్​వర్క్​ ఏర్పాటుకు రెడీ అవుతోంది భారత్​ సంచార్​ నిగమ్​ లిమిటెడ్​ (బీఎస్​ఎన్​ఎల్​). నెట్​వర్క్​ ఏర్పాటుకు రూ. 17,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీంతోపాటు ఇప్పటికే ఉన్న అప్పులు తీర్చడానికి మరో రూ. 19,605 కోట్లు కావాలి. ఈ డబ్బు తెచ్చుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరుతోంది బీఎస్​ఎన్​ఎల్​. అంతకు ముందు చేతిలోని స్థలాల విక్రయం ద్వారా డబ్బు సమకూర్చుకోవాలని బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​ చేసింది. కానీ కరోనా మహమ్మారితో ఆ ప్లాన్​ ముందుకు సాగలేదు. తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ సాయం కోరుతోంది. భూముల అమ్మకం ప్రాసెస్​ ఊపందుకునేదాకా ప్రతీ ఏడాదీ ప్రభుత్వ గ్యారంటీ ఉంటే మేలని బీఎస్​ఎన్​ఎల్​ చైర్మన్​ ప్రవీణ్​ కే పుర్వార్​ చెప్పారు. చేతికందే డబ్బుతో ఒకవైపు నెట్​వర్క్​ ఏర్పాటు చేసుకుంటూ, మరోవైపు ఉన్న అప్పులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తామని అన్నారు. నెట్​వర్క్​ విస్తరణ కార్యరూపంలోకి రావాలంటే రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని, రాబోయే మూడేళ్లకు  అప్పులపై వడ్డీలు చెల్లించడానికి మరో రూ. 20 వేల కోట్లు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్బు సమకూర్చుకోవాలని చెబుతూ పుర్వార్​ ఇటీవలే టెలికం డిపార్ట్​మెంట్​ సెక్రటరీకి ఒక లెటర్​ కూడా రాశారు. ఈ ఏడాది నుంచి 2024 దాకా మొత్తం రూ. 40 వేల కోట్లు సమీకరించుకోవాలని బీఎస్​ఎన్​ఎల్​ ఆలోచన.

లక్ష సైట్ల ఏర్పాటు.....

దేశీయంగా దొరికే టెక్నాలజీతో 1 లక్ష సైట్లను డెవలప్​ చేసేందుకు రూ. 12,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ట్రాన్స్​మిషన్​ నెట్​వర్క్​ ఎక్విప్​మెంట్, ఫైబర్​, ఐటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ల​ కోసం మరో రూ. 5 వేల కోట్లు అవసరమని లెక్కిస్తున్నారు. ఈ ఏడాది జులై చివరినాటికి బీఎస్​ఎన్​ఎల్​కు 11.5 కోట్ల మంది మొబైల్​ ఫోన్​ యూజర్లున్నారు. బీఎస్​ఎన్​ఎల్​ రెవెన్యూ మార్కెట్​ షేర్​ (ఆర్​ఎంఎస్​) 10 శాతంగా ఉంది. పోటీదారులైన రిలయన్స్​ జియో, భారతి ఎయిర్​టెల్​, వోడాఫోన్​ ఐడియాల కంటే బీఎస్​ఎన్​ఎల్​ ఆర్​ఎంఎస్​ తక్కువే. 4 జీ టెక్నాలజీ తెచ్చేందుకు ప్రపోజ్​ చేసిన టెండర్లలో గందరగోళం నెలకొనడంతో, దేశీయ ఎక్విప్​మెంట్​నే వాడాలని ఇప్పుడు నిర్ణయించింది. 4 జీ సర్వీసుల కమర్షియల్​ లాంచ్ కోసమే ఓ పైలట్​ ప్రాజెక్టును బీఎస్​ఎన్​ఎల్​ చేపడుతోంది. టీసీఎస్​ నాయకత్వంలోని కన్సార్టియమ్​ తొలిసారిగా దేశీయ టెక్నాలజీతో బీఎస్​ఎన్​ఎల్​ కోసం నెట్​వర్క్​ను ఏర్పాటు చేస్తున్నాయి. తేజాస్​ నెట్​వర్క్స్​ సప్లయ్​ చేసిన రేడియో ఎక్విప్​మెంట్​ సహా, ఇతర సాఫ్ట్​వేర్​లనూ టెలికం రిసెర్చ్​ విభాగమైన  సీ–డాట్​ టెస్టింగ్​ చేస్తోంది.
స్థలాలు అమ్మలేకపోతున్నాం..
సావరిన్​ గ్యారంటీడ్​ బాండ్ల జారీ ద్వారా సెప్టెంబర్​ 2020 లో బీఎస్​ఎన్​ఎల్​ రూ. 8,500 కోట్ల నిధులు సమీకరించింది. మరో రూ. 20 వేల కోట్ల సేకరణ కోసం చేతిలోని స్థలాలు అమ్మాలని అనుకుంది. కాకపోతే ఈ ప్లాన్​ సక్సెస్​ కాలేదు. మొత్తం అప్పులు రూ. 30 వేల కోట్ల దాకా ఉన్నాయని, ఆపరేషనల్​ ఖర్చులను సొంతంగానే సంపాదించుకోగలుగుతున్నామని బీఎస్​ఎన్​ఎల్​ చెబుతోంది. కిందటేడాది నుంచే ఆపరేషనల్​ ప్రాఫిట్స్​ వస్తున్నాయని పేర్కొంటోంది. మన దేశంలోని టెక్నాలజీని ప్రమోట్​ చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని, అయితే ఈ టెక్నాలజీని ఇంతకు ముందు ఎక్కడా వాడకపోవడంతో కొంత బిజినెస్​ రిస్క్​ ఉండొచ్చని బీఎస్​ఎన్​ఎల్​ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు.