తెలంగాణలో బౌద్ధ జైన కట్టడాలు

 తెలంగాణలో బౌద్ధ జైన కట్టడాలు

గౌతమ బుద్ధుడు కాలంలోనే తెలంగాణలో బౌద్ధ మతం ప్రవేశించింది. తెలంగాణలోని కొండపూర్​, ధూళికట్ట, తిరుమలగిరి, గాజులబండ, ఫణిగిరి, నేలకొండపల్లి, లింగాలమెట్ట, పెద్దబంకూరు, కోటిలింగాల ప్రాంతాల్లో బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయి. 

ధూళికట్ట: కరీంనగర్​ జిల్లా ఎలిగేడు మండలంలో హుస్సేమియా వాగు ఒడ్డున గల గ్రామం ధూళికట్ట. తెలంగాణలోని అతి ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ బార్హుత్​ శిల్పాల ప్రభావంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. బౌద్ధ స్తూప అవశేషాలు, శాతవాహనుల కాలం నాటి నాణేలు లభించాయి. నాగుపాము చుట్టపై బుద్ధుడు ఆశీనుడు కాగా ఐదు పడగలు విప్పి రక్షణ ఇస్తున్న శిల్పం బయట పడింది.

నాగార్జునకొండ: ఆనాటి శ్రీపర్వతం–విజయపురి ప్రాంతాన్ని ప్రస్తుతం నాగార్జునకొండగా పిలుస్తున్నారు. ఇది గుంటూరు, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఇక్కడ బుద్ధుని ధాతుగర్భ స్తూపం ఏర్పాటు చేశారు. నాగార్జునకొండ లోయలో బౌద్ధ మహా చైత్యం, ఆరామాలు, విశ్వవిద్యాలయం, క్రీడారంగ స్థలాలు, యజ్ఞశాల నిర్మాణాలు బయటపడ్డాయి. అపరశైలుల ప్రధాన కేంద్రం నాగార్జునకొండ. 

ఫణిగిరి: నల్లగొండ జిల్లాలోని ఫణిగిరి గ్రామంలో ఉత్తర దిశల్లో నాగుపాము పడగను పోలిన కొండ ఉంది. అందుకే ఆ గ్రామాన్ని పురాతన కాలం నుంచి ఫణిగిరిగా పిలుస్తున్నారు. ఇక్కడ బౌద్ధ భిక్షుల నీటి అవసరాల కోసం రెండు చెరువులను తవ్వించారు. ఫణిగిరిలో ఒకే శిలపై బౌద్ధుడి జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలు చెక్కబడ్డాయి. బుద్ధుని పాదాలు, ధర్మచక్రం శిల్పాలు లభించాయి.

నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో అతి పెద్ద స్తూపం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఉంది. బుద్ధ విగ్రహాల తయారీ శిల్పకళ క్షేత్రం ఇక్కడ బయటపడింది. ఇక్కడ బౌద్ధ సంఘారామం తొలుత హీనయాన శాఖ ప్రారంభమై అనంతరం మహాయానం బౌద్ధ శాఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది.

కోటిలింగాల: కరీంనగర్ పట్టణానికి 50కి.మీ.ల దూరంలోని వెల్లటూరు మండలంలో గోదావరి నదికి దక్షిణ దిశవైపు ఉన్న గ్రామం కోటిలింగాల. ఇక్కడ దొరికిన రాతి స్తంభంపై బ్రాహ్మిలిపిలో నాగగోపినికయ అని ఉంది. కోటిలింగాలకు 3కి.మీ. దూరంలో హుస్సేన్​వాగు సమీపంలో పాసిగాం అనే గ్రామం ఉంది. దాని పక్కన పర్వతంపై  స్తూపం చైత్యం,  చైత్యగృహం ఉన్నాయి. 

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో జైన మతాన్ని అశోకుడి మనవడు సంప్రాతి వ్యాప్తి చేశాడని జైన సాహిత్యం తెలుపుతోంది. తెలంగాణలో బోధన్​, కొలనుపాక, పోట్లచెరువు, హన్మకొండ, వేములవాడ  ప్రసిద్ధిచెందిన జైన క్షేత్రాలు. 

బోధన్​: షోడశ మహాజన పదాల్లో ఒకటైన అశ్మక రాజధాని బోధన్​. ఇక్కడ గోమఠేశ్వరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం శ్రావణబెళగళలోని గోమఠేశ్వరుని విగ్రహం కంటే ప్రాచీనమైంది. బోధన్​లో చాలా ప్రాచీనమైన జైన ప్రతిమలు, ప్రతిమ ఖండాలు లభించాయి. 

కొలనుపాక: కొలనుపాక జైన క్షేత్రం నల్లగొండ జిల్లాలో ఉంది. తెలంగాణలో నేటికీ నిలిచి ఉన్న ఏకైక జైన క్షేత్రం. కళ్యాణి చాళుక్యుల కుమార తైలపుడు ఇక్కడ జైనాలయం నిర్మించాడు. కొలనుపాకలోని ఆలయంలో పార్శ్వనాథుని విగ్రహం ఉంది. ఈ దేవాలయం శ్వేతంబర శాఖకు ప్రధానమైంది. ఈ ఆలయంలో ఇతర జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి.

పోట్లచెరువు: హైదరాబాద్​ నగరానికి దగ్గరలోని నేటి పటాన్​చెరువే పోట్ల చెరువు. ఈ క్షేత్రంలో సుమారు 500లకు పైగా జైన బసదులు ఉండేవి.

హన్మకొండ: హన్మకొండ వరంగల్​ జిల్లాలో ఉంది. ఇక్కడి ప్రాచీన జైనక్షేత్రం పద్మాక్షిగుట్ట. తొలి కాకతీయుల ప్రసిద్ధ జైన క్షేత్రం. 

వర్ధమానపురం: ఇది మహబూబ్ నగర్​ జిల్లాలో ఉంది. వర్ధమానపురం కుందూరు చోళులకు రాజధాని. వీరు జైన మతాభిమానులు. ఇక్కడ జైనాలయం నిర్మించారు. ఈ గ్రామంలో అనేక జైన విగ్రహాలు, కూష్మాండిని విగ్రహం లభించింది.