చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ

చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
  • రెండు పార్టీలకు ఈక్వల్​ చాన్స్
  • ఏబీపీ, సీ ఓటర్ సర్వేలలో వెల్లడి
  • బీజేపీకి పెరగనున్న ఓట్ షేర్

రాయ్​పూర్: చత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు ‘భరోసా కే యాత్ర’ పేరుతో రాష్ట్రాన్ని చుట్టి రాగా, బీజేపీ కూడా ‘పరివర్తన్ యాత్ర’ పేరుతో స్టేట్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసింది. మొత్తం 90 స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల మూడ్ తెలుసుకునేందుకు ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు చత్తీస్​గఢ్​లో సర్వే చేపట్టాయి. 

ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని సర్వేలో తేలింది. 90 సీట్లలో బీజేపీకి 39 నుంచి 45 స్థానాలు,  కాంగ్రెస్​కు 45 నుంచి 51 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ, సీ ఓటర్ సర్వేలో తేలింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ ఉంటుందని తెలుస్తోంది. అధికారం చేజిక్కించుకునేందుకు రెండు పార్టీలకూ సమాన అవకాశాలున్నట్లు ఓపీనియన్ పోల్​లో తేలింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 45% ఓట్లు (2018లో 43.10%), బీజేపీకి 43% ఓట్లు (2018లో 33%) దక్కుతాయని తెలిపింది. అంటే, కాంగ్రెస్ ఓట్ షేరింగ్ 2.20%, బీజేపీ 10.50 % పెరిగే చాన్స్ ఉంది.  

2018లో 15 స్థానాలకే పరిమితమైన బీజేపీ

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో 15 ఏండ్ల బీజేపీ పాలనకు తెరపడినట్టయింది. మొత్తం 90 సీట్లలో.. కాంగ్రెస్ 68 స్థానాల్లో, బీజేపీ 15 స్థానాల్లో, జనతా కాంగ్రెస్ చత్తీస్​గఢ్ (జేసీసీ) 5 స్థానాల్లో, బీఎస్పీ 2 స్థానాల్లో గెలిచాయి. అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే.. కాంగ్రెస్ 29 స్థానాలు మెరుగుపర్చుకోగా.. బీజేపీ 34 స్థానాలు కోల్పోయింది. 2018లో బంపర్ మెజార్టీతో భూపేశ్ బాఘెల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈసారి మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చత్తీస్​గఢ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. 2018 ఎన్నికల్లో ఆప్ మొత్తం 85 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సెగ్మెంట్​లో కూడా గెలవలేదు. 

Also Read : దళితబంధు రాలేదని సర్పంచ్​ ఇంటికి తాళాలు

ఐదేండ్ల పాలనే గెలిపిస్తుందంటున్న కాంగ్రెస్

మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. ఐదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని కాంగ్రెస్ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అల్లర్లలో కొడుకును కోల్పోయిన తండ్రికి టికెట్బే

మెతారా సిటీలో ఈ ఏడాది ఏప్రిల్​లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఈ హింసలో ఈశ్వర్ సాహు తన కొడుకును కోల్పోయాడు. బిరాన్​పూర్ గ్రామానికి చెందిన ఈశ్వర్ సాహును.. సజా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపుతోంది. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ ఇప్పటికే 85 మంది అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ ప్రచారం

అపోజిషన్ బీజేపీ 21 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను కొన్ని నెలల ముందే విడుదల చేసింది. దీంతో అభ్యర్థులందరూ సీఎం భూపేశ్ బాఘెల్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రచారం చేస్తున్నారు. ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని బీజేపీ లీడర్లు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ప్రతీ సెక్టార్​లో అవినీతి రాజ్యమేలుతున్నదన్న కోణంలో బీజేపీ ప్రచారం చేస్తోంది. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ఎమ్మెల్యేలు, వ్యాపారులు ఇండ్లపై జరిగిన దాడులే దీనికి నిదర్శనమని ప్రజలకు బీజేపీ తెలియజేస్తోంది. ట్రైబల్ ఏరియాల్లో బలవంతపు మత మార్పిళ్ల అంశం కూడా బీజేపీ లేవనెత్తుతున్నది.