బీఆర్ఎస్ ఆగం.. కడియం కావ్య లేఖతో కలకలం

బీఆర్ఎస్ ఆగం.. కడియం కావ్య లేఖతో కలకలం
  • పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్​లో అయోమయం
  • పార్టీని ఇంకెంతమంది వీడిపోతరోనని చర్చ
  • ఇప్పటికే ఐదుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే గుడ్ బై 
  • కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైన కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి 
  • అదే బాటలో కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఆగమాగమవుతున్నది. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ కేసీఆర్​కు లేఖ రాయడం, పార్టీ అవినీతి వ్యవహారాలపై ఆమె అందులో ప్రశ్నించడం కలకలం రేపుతున్నది. ఇప్పటికే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా, ఇంకెంతమంది పోతరోనని కేడర్​లో చర్చ జరుగుతున్నది. కావ్య లెక్కనే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బయటపడుతున్న అవినీతి వ్యవహారాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని.. దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని అభ్యర్థులు భావిస్తున్నట్టు గులాబీ లీడర్లలోనే డిస్కషన్ నడుస్తున్నది.  

ఒక్కొక్కరుగా గుడ్ బై.. 

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ  సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్​లో చేరనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదే బాటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య కూడా నడవనున్నారు. వాళ్లతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ గతి ఏమవుతుందని బీఆర్ఎస్ కేడర్ ఆందోళనలో ఉన్నది. ఇంకా పార్టీలోనే కొనసాగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే ఆలోచనలో పడింది.

కాగా, ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​కు గుడ్ బై చెప్పారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేశ్, పసునూరి దయాకర్ కాంగ్రెస్​లో చేరగా.. బీబీ పాటిల్, పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ కారు దిగి, కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. 

కడియం శ్రీహరి బిడ్డ, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడం బీఆర్‌‌ఎస్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. గురువారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. సాయంత్రానికి పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్‌‌ఎస్ లీడర్లందరినీ అయోమయంలోకి నెట్టింది. పార్టీ దిగజారిన తీరును, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని పార్టీ అధినేత కేసీఆర్​కు రాసిన లేఖలో కావ్య వివరించారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవడం ఎవరికైనా అసాధ్యమేనని ఆమె చెప్పకనే చెప్పారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను ఎలా దిగజార్చాయో లేఖలో వివరించారు. వరంగల్‌లో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని స్పష్టం చేశారు. ‘‘కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాల వార్తలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి.

జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీకి మరింత నష్టం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని తన లేఖలో కావ్య పేర్కొన్నారు. ఒక్క వరంగల్‌లోనే కాదు.. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే బీఆర్‌‌ఎస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీనియర్ నాయకులు కూడా ముందుకు రాలేదు. కేసీఆర్ వెతికివెతికి అభ్యర్థులను ప్రకటిస్తే, ఇప్పుడు వాళ్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఆ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని, ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తుండడం బీఆర్‌‌ఎస్​ను మరింత కలవరానికి గురిచేస్తున్నది. 

కేసీఆర్, కేటీఆర్​పై కేడర్ ఫైర్ 

బీఆర్ఎస్ పరిస్థితి దిగజారడానికి కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించిన తీరే కారణమని పార్టీలో మొదట్నుంచి ఉన్న నాయకులు విమర్శిస్తున్నారు. ఉద్యమంలో పార్టీకి అండగా నిలబడి, పార్టీ నిర్మాణం కోసం పని చేసిన తమకు అన్యాయం చేసి.. వలస నేతలను నెత్తిన ఎక్కించుకున్న కేసీఆర్‌‌కు ఇలా జరగాల్సిందేనని అంటున్నారు. పార్టీ పరిస్థితి దిగజారడానికి కేసీఆర్‌‌ చేసిన తప్పులే కారణమని, కేటీఆర్‌‌ ముంగట్నే నాయకులు వేలెత్తి చూపుతున్నారు. బీఆర్‌‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమ తెలంగాణ టీమ్, బంగారు తెలంగాణ(బీటీ) టీమ్‌గా విడిపోయింది.

బీటీ టీమ్ నాయకులకే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం, పదవులు ఇచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే తమదిప్పుడు ఉద్యమ పార్టీ కాదు అని, ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ సమాధానం చెప్పేవారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్ చేసిన రాజకీయమే చేసి, బీఆర్‌‌ఎస్‌ను దెబ్బకొడుతున్నది. ఏం చేయాల్నో తోచక కేసీఆర్ ఫామ్‌హౌస్​కే పరిమితమవగా.. కేటీఆర్, హరీశ్‌ విమర్శలు, ఆరోపణలతో సరిపెడుతున్నారు. 

ప్రజలపైనే నిందలు.. 

ఎన్నికల్లో ఓటమి చెందగానే కేసీఆర్ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకుంటారని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. ఓటమిని అంగీకరించి తప్పులు సరిదిద్దుకుంటామని ఆయన చెబుతారని ఆశించారు. జనంలో కాదు పార్టీలోనే లోపాలు ఉన్నాయని చెబుతారని ఊహించారు. కానీ, దీనికి భిన్నంగా కేసీఆర్​ ప్రజల్ని తప్పుబట్టడమే కాదు.. వాళ్లపైనే నిందలు వేశారు. ‘‘పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నారు’’ అని నల్గొండ సభలో అంటే.. ‘‘అత్యాశకు పోయి కాంగ్రెస్​ను గెలిపించారు’’ అని కరీంనగర్ సభలో అన్నారు.

కేసీఆర్ బాటలోనే కేటీఆర్‌‌ కూడా తొలుత ప్రజలను నిందించారు. కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని ఆరోపించారు. ఈ ఆరోపణలనే బలంగా మార్చుకున్న రేవంత్‌ రెడ్డి.. ప్రభుత్వాన్ని కూలుస్తుంటే చూస్తూ కూర్చోలేం కదా అంటూ బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు గేట్లు తెరిచారు. దీంతో ఇప్పుడు మాట మార్చిన కేటీఆర్‌‌.. కాంగ్రెస్‌ సర్కార్‌‌ను కూల్చాల్సిన అవసరం తమకు లేదని, ఆ పార్టీ నాయకులే కూలుస్తారంటూ కొత్తరాగం అందుకున్నారు. కానీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు.

బయటపడుతున్న అవినీతి.. మసక బారుతున్న ప్రతిష్ట

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌‌‌‌ఎస్ చేసిన అవినీతి, అక్రమాలేవీ పెద్దగా బయటపడలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్​ వచ్చాక బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలన్నింటినీ తవ్వుతున్నది. ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు వ్యవహారం మరువకముందే, గొర్ల స్కీమ్‌‌లో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా కాగ్ బయటపెట్టింది. ఒక చిన్న స్కీమ్‌‌లోనే వేల కోట్లు దోచుకున్న తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతలోనే లిక్కర్ స్కామ్‌‌లో కవిత అరెస్ట్ కావడం బీఆర్ఎస్ ను కుదిపేసింది.

ఇదిలా ఉండగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకొచ్చింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత మనుషుల ఫోన్లను కూడా అధికారంలో ఉన్నప్పుడు ట్యాప్ చేసినట్టు.. సినిమా వాళ్లను, వ్యాపారస్తులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు విచారణలో తేలుతున్నది. ఈ నేపథ్యంలో తమ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని బీఆర్ఎస్ లీడర్లు అనుమానిస్తున్నారు.