మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్, వెలుగు: మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని మద్దూరు, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికల్లో వలస ఓటర్లే కీలకంగా మారనున్నారు. దీంతో వారిని గ్రామాలకు రప్పించేందుకు క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న క్యాండిడేట్లు.. ఈ సారి కాస్త జాగ్రత్త పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో వలస ఓటర్లను రప్పించేందుకు అప్పటి ప్రధాన పార్టీల క్యాండిడేట్లు స్వయంగా రంగంలోకి దిగారు.
ఈ మండలాలకు చెందిన వలస కూలీలు ఎక్కువగా ముంబై, పూణె ప్రాంతాల్లో ఉండడంతో.. అప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వారిని స్వయంగా కలుసుకున్నారు. అనంతరం వారి ప్రధాన అనుచరులకు వాహనాలను అప్పగించి.. ఓటర్లను ఒక రోజు ముందే స్వగ్రామానికి తీసుకొచ్చారు. కానీ మిగతా క్యాండిడేట్లు సైతం ఈ ఓటర్లను కలవడం, వివిధ రకాల హామీలు ఇవ్వడంతో ఓట్లు చీలిపోయాయి. దీంతో ఖర్చు భరించి ఓటర్లను తీసుకొచ్చిన క్యాండిడేట్‌కు కాకుండా.. మరో క్యాండిడేట్‌కు మేలు జరిగింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ కాకుండా క్యాండిడేట్లు జాగ్రత్త తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఓటర్లను ముందు రోజు కాకుండా.. పోలింగ్ రోజున, డైరెక్ట్‌గా పోలింగ్ సెంటర్‌కే తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఉదయం వరకు కేంద్రానికి తీసుకొచ్చి.. ఓటేసిన తర్వాతి తిరిగి వారు ఉండే ప్రాంతాలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి విడతలో ఆరు మండలాల్లోని 137 గ్రామాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పట్నంలో ఉంటున్న ఓటర్లతో క్యాండిడేట్లు ఇప్పటికే పలు రకాల సంప్రదింపులు జరిపి.. ఓటేసేందుకు రావాలని అభ్యర్థించారు. కాగా, సొంత వాహనాల్లో వచ్చే వారికి అవసరమైన ఖర్చులు ఇవ్వడంతో పాటు.. ఆటోలు, బస్సుల్లో వచ్చే వారికి సైతం ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు సైతం చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.

