ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. టాలీవుడ్ హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ స్పాట్ డెడ్

ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. టాలీవుడ్ హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ స్పాట్ డెడ్
  • రంగారెడ్డి జిల్లా బొంగులూరు సమీపంలో ప్రమాదం
  • మృతులు ఏపీకి చెందిన వారుగా గుర్తింపు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బొంగులూరు సమీపంలో జరిగినట్లు ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వేదయపాళెం గ్రామానికి చెందిన కత్తి భరత్ కాంత్ (31), నెల్లూరుకు చెందిన గూడ సాయిత్రిలోక్ (31) ఆదివారం తెల్లవారుజామున 3:20 గంటల సమయంలో కారులో బొంగులూరు నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్నారు.

బొంగులూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం. 12 వద్దకు రాగానే, వీరి ముందు వెళ్తున్న కంటైనర్ ట్రక్కును కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భరత్ కాంత్‌‌తోపాటు సాయిత్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓఆర్ఆర్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.