వీసీ చాంబర్‌‌‌‌ను ముట్టడించినందుకు 13 మంది కేయూ స్టూడెంట్లపై కేసులు

వీసీ చాంబర్‌‌‌‌ను ముట్టడించినందుకు 13 మంది కేయూ స్టూడెంట్లపై కేసులు
  • వీసీ చాంబర్‌‌‌‌ను ముట్టడించినందుకు
  • ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్
  • రెండు రోజుల కిందట 11 మంది అరెస్ట్
  • గతంలో ఫీజుల పెంపుపై కేయూలో ఆందోళన చేసిన మరో 8 మందిపై కేసులు
  • నిరుడు హాస్టళ్లు తెరవాలని ఆందోళన చేసినందుకు ఓయూలో 21 మందిపైనా..

హనుమకొండ, వెలుగు: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ చాంబర్‌‌ను ముట్టడించిన ఘటనలో 13 మంది స్టూడెంట్లపై వర్సిటీ అధికారులు కేసులు పెట్టించారు. రెండురోజుల కిందట వీసీ చాంబర్‌‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్లను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి, కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అదేరోజు పోలీసులు 11 మంది స్టూడెంట్స్​ను అరెస్ట్ చేశారు.

కేయూ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు గురువారం 13 మంది విద్యార్థులపై పోలీసులు కేసులు పెట్టారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేశారంటూ ఐపీసీ 143, 447, 421, 290, 506 సహా పలు  సెక్షన్ల కింద నమోదు చేశారు. దీంతో వర్సిటీ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టూడెంట్లపై కేసులు పెట్టించడం ఏంటని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమకాలంలోనూ లేని కేసులు ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు.

ఆందోళన చేస్తే కేసులు

వర్సిటీల్లోని సమస్యలపై మార్చి 3న ‘తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమకారుల  సంఘర్షణ  సభ’ నిర్వహించేందుకు కేయూ స్టూడెంట్స్ జేఏసీ పర్మిషన్ అడిగితే ఆఫీసర్లు ఇవ్వలేదు. దీంతో మీటింగ్​ను ఈ నెల 25, 29కు వాయిదా వేసినా వర్సిటీ అధికారులు అనుమతివ్వలేదు. దీంతో ఆగ్రహించిన స్టూడెంట్స్​29న టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వీసీ బిల్డింగ్‌ను ముట్టడించారు. వీసీ చాంబర్‌‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనలో 11 మంది స్టూడెంట్స్​ను అరెస్ట్ చేశారు. తాజాగా13 మందిపై వివిధ సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూలోనూ బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, టీఎస్​పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన స్టూడెంట్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిరుడు నవంబర్ 18న ఓయూలోని ఈ2 హాస్టల్, మెస్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఆందోళన చేపట్టగా.. 21 మంది స్టూడెంట్లపై కేసులు పెట్టారు. కేయూలో నిరుడు ఫీజుల పెంపు, ఎస్​ఎఫ్​సీ స్టూడెంట్లకు హాస్టల్​ వసతి కల్పించాలని ఆందోళన చేపట్టగా, 8 మందిపై కేసు నమోదు చేశారు.

ఉస్మానియా, కాకతీయతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై కొద్దిరోజులుగా స్టూడెంట్స్ పోరాడుతున్నారు. అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కొరతతో చదువులు ముందుకు సాగడం లేదు. సర్కారు నుంచి సరిపడా ఫండ్స్​రాకపోవడంతో వర్సిటీ అధికారులు పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన వైస్ చాన్స్​లర్లు, రిజిస్ట్రార్లు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రాపకం కోసం స్టూడెంట్లపై కేసులు పెట్టి అణగదొక్కుతున్నరనే ఆరోపణలున్నాయి.

ఉమ్మడి ప్రభుత్వాలు ఎన్నడూ కేసులు పెట్టలే

తెలంగాణ సాధనోద్యమంలోనూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. రోడ్లను నిర్బంధించి నిరసనలు తెలిపాయి.  లాఠీచార్జీలకు దారితీసిన పరిస్థితులూ ఉన్నాయి. ఎంత చేసినా అప్పటి ప్రభుత్వం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకొని వదిలేసిందే తప్ప .. ఇలా కేసులు పెట్టలేదని స్టూడెంట్ ​యూనియన్ లీడర్లు అంటున్నారు.

ఇంత నిర్బంధమా?

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ సభకు పిలుపునిస్తే పర్మిషన్ ఇయ్యకుండా అడ్డుకున్నరు. తెలంగాణ ఉద్యమంలో ఆందోళనలు చేస్తే లేని కేసులు.. ఇప్పుడు పెడుతున్నారు. 
విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయంలో ఆందోళన చేస్తే ఇంత నిర్బంధమా?   - ఇట్టబోయిన తిరుపతి యాదవ్,  కేయూ స్టూడెంట్ జేఏసీ చైర్మన్​