ఆధార్​లో ఉన్నట్లే జాబ్ కార్డును ఎడిట్ చేయాలని కేంద్రం ఆదేశాలు

ఆధార్​లో ఉన్నట్లే జాబ్ కార్డును ఎడిట్ చేయాలని కేంద్రం ఆదేశాలు

రాష్ట్రంలో 33.22 లక్షల మందికి పూర్తికాని ఆధార్ సీడింగ్

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకంలో బోగస్ కార్డులను అరికట్టేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం అన్ని జాబ్ కార్డులను ఆధార్ నంబర్ తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని నిర్ణయించింది. అలాగే కూలీల పేరు ఆధార్ కార్డులో ఉన్నట్లే జాబ్ కార్డులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులతో ఆధార్ సీడింగ్ చేయడం ఇంతకు ముందు నుంచే కొనసాగుతున్నప్పటికీ.. గతంలో దీనిని తప్పనిసరిగా పరిగణించలేదు. అయితే, బోగస్ జాబ్ కార్డుల పేరిట పలు రాష్ట్రాల్లో పేమెంట్స్ జరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు ఆధార్ సీడింగ్ ను తప్పనిసరి చేసినట్లు తెలిసింది. ఆధార్ సీడింగ్ చేసిన జాబ్ కార్డు హోల్డర్స్ కే జనవరి 1 నుంచి కూలి డబ్బులు అకౌంట్​లో జమ కానున్నాయి. సీడింగ్ కాకపోతే పనులకు వెళ్లినా డబ్బులు జమ కావు. దీంతో ఈ నెల 31 లోగా లింక్ చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు రాత్రింబవళ్లు కుస్తీ పడుతున్నారు.  

రాష్ట్రంలో 1,20,09,621 మంది ఉపాధి హామీ కూలీలు 

రాష్ట్రంలో 1,20,09,621 మంది ఉపాధి హామీ కూలీలు ఉండగా.. ఇందులో 86,86,958 మంది జాబ్ కార్డులు ఆధార్ సీడింగ్ అయ్యాయి. మరో 33,22,663 మంది కూలీల జాబ్ కార్డులు ఆధార్ సీడింగ్ కాలేదు. ఇందులో రెగ్యులర్ గా పనికి వెళ్లే యాక్టివ్ వర్కర్సే 2,89,341 మంది ఉన్నారు. మొత్తంగా చూసినప్పుడు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 2,82,105, ఖమ్మం జిల్లాలో 2,28,026, సూర్యాపేట జిల్లాలో 1,89,818 మంది వర్కర్ల కార్డులను ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉంది. కాగా, 90 శాతం ఆధార్ సీడింగ్ తో నారాయణ పేట జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. ఈ జిల్లాలో మొత్తం 2.28 లక్షల కార్డులకు గాను 2.07 లక్షల కార్డులను ఆధార్ సీడింగ్ చేశారు. హనుమకొండ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 2.07 లక్షల కార్డుల్లో 1.20 లక్షల కార్డులు మాత్రమే లింకయ్యాయి.