
- యాదాద్రి జిల్లాకు 13,517 టన్నులు అవసరం
- మే నెలకు సంబంధించి మిగిలినవి 2 వేల టన్నులు
- మిగతావి జనగామ, వరంగల్‌నుంచి పంపాలని ఆదేశాలు
యాదాద్రి, వెలుగు: వానాకాలం సీజన్ నేపథ్యంలో రేషన్‌లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని జూన్ నెలలో ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు మూడు నెలలకు సరిపడా బియ్యం స్టాక్అలాట్చేసింది. ఎక్కడ వీలైతే అక్కడ నిల్వ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
2,17,323 రేషన్‌కార్డులు
యాదాద్రి జిల్లాలో 2,17,323 రేషన్ కార్డులు, 7,06,368 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ప్రతీ నెల 4,483 టన్నుల బియ్యం ఇస్తున్నారు. మూడు నెలలు జూన్, జూలై, ఆగస్టు కలిపి ఇవ్వాలంటే 13,517 టన్నులు అవసరం. మే నెలకు సంబంధించి 2 వేల టన్నుల స్టాక్ ఉంది. మిగతా 11,517 టన్నులను జనగామ, వరంగల్జిల్లాల నుంచి యాదాద్రి జిల్లాకు స్టాక్పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
నిల్వ కోసం ముందస్తు చర్యలు
మూడు నెలల బియ్యం ఒకేసారి వస్తుండడంతో సివిల్ సప్లయ్ఆఫీసర్లు వాటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 515 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఆయా షాపుల్లో ఎంత ప్లేస్ ఉంటే ఆ స్థాయిలో స్టాక్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారులకు నెల రోజులపాటు బియ్యం పంపిణీ చేయనున్నారు.