వ్యాక్సినేషన్ తర్వాత కరోనా సోకడంపై కేంద్రం ఫస్ట్ టైం వివరాలు వెల్లడించింది. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా వస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ప్రకటించింది కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ.వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి పదివేల మందిలో ముగ్గురు, నలుగురికి అలా జరుగుతోందని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారిలో 0.04 శాతం మందికి కరోనా వస్తోందని తెలిపింది. 93 లక్షల 56 వేల 436 మంది కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే..4 వేల 208కి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. కొవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకున్న వారిలోనూ 0.04 శాతం మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది స్పష్టం చేసింది. 17 లక్షల 37 వేల 178 మంది కోవిషీల్డ్ రెండో డోసు తీసుకోగా...కేవలం 695 మందికే మళ్లీ కరోనా సోకినట్లు తెలిపింది.
ఇక సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ 10 కోట్ల 3 లక్షల 2 వేల 745 మందికి వేయగా కేవలం 17 వేల 145 మందికి మాత్రమే మళ్లీ పాజిటివ్ వచ్చిందన తెలిపింది కేంద్రం. ఇది 0.02 శాతం మాత్రమేనని చెప్పింది. ఇక కోవిషీల్డ్ రెండో డోసు కోటి 57 లక్షల 32 వేల 754 మందికి ఇవ్వగా...5 వేల 14 మందికి మళ్లీ కరోనా సోకిందని తెలిపింది. ఇది మొత్తం సంఖ్యలో 0.03 శాతం మాత్రమేనని తెలిపింది.
వ్యాక్సిన్స్ సురక్షితమని చెప్పేందుకు ఈ లెక్కలే ఆధారమని తెలిపింది కేంద్రం. ఐతే వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కరోనా రాకుండా అడ్డుకోదని, కానీ తీవ్రతను తగ్గించడం సహా మరణాలను ఆపుతుందని నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ కు వ్యతిరేకంగా ఇమ్యూనిటి పెరగడానికి రెండు వారాలు పడుతుందుని చెప్తున్నారు.
