లాక్ డౌన్ రూల్స్ డైల్యూట్ చేయొద్దు

లాక్ డౌన్ రూల్స్  డైల్యూట్ చేయొద్దు
  • కేరళ సహా అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం ఆదేశం
  • ముంబైతోపాటు కొన్ని సిటీల్లో సీరియస్ గా ఉందని వెల్లడి
  • కేంద్రం అభ్యంతరంతో వెనక్కి తగ్గిన కేరళ

న్యూఢిల్లీ/తిరువనంతపురం: ముంబై, కోల్ కతాతోపాటు కొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. లాక్ డౌన్ చర్యలను ఉల్లంఘిస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశంలో పలుచోట్ల హెల్త్ కేర్ సిబ్బందిపై దాడులు, లాక్ డౌన్ ఉల్లంఘనలను ఆపాలని అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెర్రిటరీలను కేంద్రం ఆదేశించింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, మహారాష్ట్రలోని ముంబై, పుణె, రాజస్థాన్ లోని జైపూర్, వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతా, హౌరా, ఈస్ట మేదినీపూర్, నార్త్ 24 పరగణ, డార్జిలింగ్, కలింపొంగ్, జల్పాయ్ గురిలో పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ కు అవసరమైన సాయం చేసేందుకు, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు ఆరు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పింది.

లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేయాలి

కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అమలు చేస్తు్న్న లాక్ డౌన్ ను ఏ స్థాయిలోనూ డైల్యూ్ట్ చేయొద్దని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, యూటీల సీఎస్ లకు లెటర్లు రాశారు. కేంద్రం మార్గదర్శకాలకు విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయని, కొన్ని యాక్టివిటీస్ ను అనుమతిస్తున్నాయని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్ డౌన్ ను స్ట్రిక్ట్ గా అమలు చేయాలని సూచించారు.

లాక్ డౌన్ సడలింపును వెనక్కి తీసుకున్న కేరళ

కేంద్రం అభ్యంతరం చెప్పడంతో లాక్ డౌన్ సడలింపును కేరళ వెనక్కి తీసుకుంది. తాము జారీ చేసిన గైడ్ లైన్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ లెటర్ రాయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు కేంద్రం గైడ్ లైన్స్ ఉల్లంఘించలేదని, కమ్యునికేషన్ గ్యాప్ వల్లే ఇలా జరిగిందని కేరళ సర్కారు సమర్థించుకుంది. మున్సిపాలిటీల్లో రెస్టారెంట్లు, బుక్ స్టోర్స్, సెలూన్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు తెరిచేందుకు, సిటీలు, టౌన్ లలో తక్కువ దూరం వరకు వాహనాల్లో ప్రయాణించేందుకు ఇచ్చిన సడలింపును ఉపసంహరించుకుంది.