కరోనా క్రైసిస్ ను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు, ఎన్నారైలు ఇతర దాతల నుంచి విరాళాలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ (PM CARES) ఫండ్ వివరాలను బయటపెట్టాలంటూ ఓ లాయర్ కోర్టునాశ్రయించారు. ప్రధాని చైర్మన్ గా మార్చి 28న ప్రారంభించిన ఈ పీఎం కేర్స్ ట్రస్ట్ కు ఇప్పటి వరకు వచ్చిన నిధులు, వాటిని దేనికి ఖర్చు చేశారన్న దాన్ని వెబ్ సైట్ లో పెట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఈ మేరకు నాగ్ పూర్ లోని బాంబే హైకోర్టు బెంచ్ ఎదుట ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు మహారాష్ట్రకు చెందిన లాయర్ అర్వింద్ వాఘ్మర్. దీనిపై మంగళవారం నాడు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సోలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఈ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. పీఎం కేర్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఎస్బీ షుక్రే, జస్టిస్ ఏఎస్ కిలోర్ ల ధర్మాసనం కొట్టేసినట్లు ఆయన వివరించారు. అయితే పిటిషనర్.. కేంద్రం తరఫు న్యాయవాది వాదన సరికాదని, తాను పీఎం కేర్స్ ఏర్పాటును వ్యతిరేకించడం లేదని, నిధుల వివరాలు పారదర్శకంగా ఉండేందుకు వెబ్ సైట్ లో పెట్టాలని కోర్టు ఆదేశించాలని కోరుతున్నానని అన్నారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
పిటిషన్ లోని మరికొన్ని కీలక అంశాలు
– పీఎం కేర్స్ కు ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు, ఖర్చులకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలిసేలా కేంద్ర ప్రభుత్వం వెబ్ సైట్ లో ఉంచాలి.
– పీఎం కేర్స్ ట్రస్టు ఏర్పాటు చేసినప్పుడు మరో ముగ్గురు ట్రస్టీలను నియమిస్తామని కేంద్రం ప్రకటించింది. మార్చి 28 నుంచి నేటి వరకు అటువంటి నియామకాలేవీ జరగలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
– ఆ ముగ్గురు ట్రస్టీల్లో కనీసం ఇద్దరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఉండేలా కోర్టు ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీని ద్వారా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా.. పారదర్శకంగా నిధుల ఖర్చు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.
