జీ20 సదస్సుపై రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

జీ20 సదస్సుపై రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‭లో కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. జీ20 సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.  ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జయశంకర్‭లు కూడా ఈ మీటింగ్‭లో పాల్గొననున్నారు. భారత్‌లో వచ్చే ఏడాది సెప్టెంబరులో జరగనున్న జీ-20 సదస్సు కోసం కేంద్రం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను కూడా ప్రధాని మోడీ ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

జీ20 సదస్సుకు సంబంధించి ఇప్పటికే ఇండోనేషియా నుంచి భారత్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. వచ్చే ఏడాది విజయవంతంగా సదస్సును నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా.. భారత్ అధికారికంగా డిసెంబర్ 1న జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఇండోనేషియా నగరం బాలీలో ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ.. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి పలు దేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు.