పేదలకు అందుబాటులో లేని క్యాన్సర్ చికిత్స

పేదలకు అందుబాటులో లేని క్యాన్సర్ చికిత్స
  • ఏటా 3 నుంచి 4 శాతం పెరుగుతున్న బాధితులు
  • ఈ ఏడాది ఇప్పటికే 3వేలకు పైగా కేసులు
  • బాధితుల్లో ఎక్కువ మంది గ్రామీణ పేద మహిళలు
  • పేదలకు గగనమైన క్యాన్సర్ ట్రీట్​మెంట్ 

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్రంలో సర్వైకల్​ క్యాన్సర్(గర్భాశయ ముఖ ద్వార) డేంజర్​ బెల్స్​మోగిస్తున్నది. దీని బారిన పడుతున్న మహిళల సంఖ్య ఐదేండ్లుగా ఏటా మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతోంది. గ్రామీణ మహిళలు, చిన్నప్పుడే పెండ్లయిన వారిలో ఈ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా బయట పడుతున్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకు 23,272 మంది మహిళలు ఈ క్యాన్సర్​ బారినపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 3 వేలకు పైగా కేసులు వచ్చాయి. ప్రతి జిల్లాలో సగటున ప్రతి నెల10కిపైగా కొత్త కేసులు బయట పడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్ జనరల్​హాస్పిటల్​లో జనవరి నుంచి జులై వరకు 2,957 స్క్రీనింగ్​ టెస్టులు చేయగా 45 మందికి ఈ క్యాన్సర్ వచ్చినట్లు తేలింది.

ప్రతి పీహెచ్​సీలో స్క్రీనింగ్ అన్నరు..

సర్వైకల్​ క్యాన్సర్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం, జిల్లాల్లోని హాస్పిటల్స్​లో అంకాలజిస్టులు లేకపోవడంతో వ్యాధిని గుర్తించడంలో లేట్‌‌ అవుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా 25 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసులోపు మహిళలకు స్క్రీనింగ్  టెస్టులు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాన్సర్​ డే సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు క్యాన్సర్​పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి పీహెచ్​సీలో స్క్రీనింగ్​ టెస్టులు చేస్తామని, ప్రాథమిక దశలోనే గుర్తించి ట్రీట్​మెంట్ ఇప్పిస్తామన్నారు. కానీ, ఇంత వరకు ఎక్కడా స్క్రీనింగ్ ​టెస్టులు చేయలేదు. టెస్టులు చేయడానికి అవసరమైన పరికరాల కోసం ఫండ్స్​ఇవ్వలేదు. జిల్లా ఆస్పత్రిలో మాత్రమే​ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు.

క్యాంపులు మరిచిన సర్కార్​

ఉమ్మడి రాష్ట్రంలో ‘ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ రూరల్​హెల్త్​ స్టడీస్’ ఆధ్వర్యంలో 2006 నుంచి 2011 వరకు సర్వైకల్ క్యాన్సర్​పై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపిక చేసిన పది మండలాల పరిధిలోని 60 గ్రామాల్లో అవేర్​నెస్ ​కల్పించారు. జిల్లా ఆస్పత్రిలో స్క్రీనింగ్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 8 ఏండ్ల నుంచి ఎక్కడా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు.

వ్యాక్సిన్​పై ప్రచారమే లేదు

హైరిస్క్​ హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్​పీవీ) వల్ల సర్వైకల్ క్యాన్సర్​ వస్తుంది. పరిశుభ్రత పాటించని మహిళలకు కూడా ఈ క్యాన్సర్​వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంది. ఈ క్యాన్సర్ నివారణకు 9 నుంచి 26 ఏండ్ల మధ్య వయసున్న వారికి హెచ్​పీవీ వ్యాక్సిన్ వేయించాలి. ఈ వ్యాక్సిన్​ సర్వైకల్​ క్యాన్సర్​ నుంచి 80% వరకు కాపాడుతుంది. అయితే.. ఇలాంటి వ్యాక్సిన్ ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. ప్రభుత్వం కూడా వ్యాక్సిన్​గురించి అవగాహన, ప్రచారం చేయడం లేదు.
 

సర్వైకల్ కాన్సర్ లక్షణాలు
పీరియడ్స్ రాకపోవడం, పీరియడ్స్​లేకున్నా రక్తస్రావం.., ఆకస్మికంగా  బరువు తగ్గడం, పొత్తికడుపులో నిరంతరంగా నొప్పి.

50 నుంచి 60% మరణాలు
సర్వైకల్ ​క్యాన్సర్ ​రోగుల్లో దాదాపు 50 నుంచి 60 శాతం మంది చనిపోతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. మొదటి దశలో ఉన్న వారికి జీజీహెచ్​లలోనే థర్మోకొయాగ్లేషన్, ట్రయోథెరపి అందిస్తున్నారు. అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వారిని హైదరాబాద్​లోని ఎంఎన్​జే క్యాన్సర్ ఆస్పత్రికి రెఫర్ ​చేస్తున్నారు. అక్కడ బాధితులకు రేడియేషన్, కీమోథెరపీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇదొక్కటే ప్రభుత్వ క్యాన్సర్ ​ఆసుపత్రి కావడంతో అక్కడ బెడ్లు దొరకడం లేదు. దీంతో పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కేసుల వివరాలు ఇలా..
ఏడాది             కేసులు
2017                 4,423 
2018                 4,539
2019                4,648
2020                4,812
2021                4,850 
2022                3 వేలకు పైగా 
 (ఇప్పటి వరకు)

లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేస్తున్నరు
జీజీహెచ్​లో క్యాన్సర్ స్ర్కీనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడికి వచ్చే మహిళలను సిబ్బంది రెగ్యులర్​గా ఎడ్యుకేట్ చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేస్తున్నారు. చిన్నప్పుడే పెండ్లి అయినవారిలో, చిన్న వయసులోనే కాన్పులు అయిన వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా రిపోర్ట్​ అవుతోంది.   - రాంకిషన్, సూపరింటెండెంట్, జీజీహెచ్, మహబూబ్ నగర్