
ఇప్పటికే ఉన్న పిచ్చి పిచ్చి చాలెంజ్‌లు చాలవన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త చెత్త చాలెంజ్ ఇంటర్నెట్‌లో వైరలవుతోంది. ఈ మధ్యే వైరలైన తలలు పలగ్గొట్టుకునే ‘స్కల్ బ్రేక్ చాలెంజ్’ మరవకముందే ఇప్పుడు ‘చాచా స్లైడ్’ అనే ఇంకో చాలెంజ్ దాపురించింది. 20 ఏండ్ల కిందట వచ్చిన ‘చాచా స్లైడ్’ అనే పాటకు తగ్గట్టు కారు స్టీరింగ్‌ను తిప్పడమే ఈ గేమ్. ఆ పాటలో ‘స్లైడ్ టు ది లెఫ్ట్’ అంటే ఎడమ వైపు, ‘స్లైడ్ టు ది రైట్’ అంటే కుడివైపుకు స్టీరింగ్‌ను తిప్పుతూ పోవాలి. కారును అడ్డదిడ్డంగా, పాములాగా తిప్పుతూ పోతే పెద్ద పెద్ద ప్రమాదాలే జరుగుతాయని, లైఫే రిస్క్‌లో పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టిక్‌టాక్‌లో బాగా వైరలవుతున్న ఈ గేమ్ వీడియోలను చూసి యువత రిస్క్ చేస్తుండటంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైతే ఈ గేమ్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇలాంటి వీడియోలపై టిక్‌టాక్ వార్నింగ్ కూడా పెడుతోంది. కానీ వీడియోలు మాత్రం తీసేయలేదు.