చంద్రబాబు కరకట్ట ఇంటిపై ఈ దశలో నిర్ణయం తీసుకోలేం : ఏసీబీ కోర్టు

చంద్రబాబు కరకట్ట ఇంటిపై ఈ దశలో నిర్ణయం తీసుకోలేం : ఏసీబీ కోర్టు

చంద్రబాబు నివాసం జప్తు కేసు మళ్లీ మొదటికి వచ్చింది.   కరకట్ట నివాసం జప్తు పిటిషన్ పై తీర్పు ఈ నెల 16 కు  వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసి న జప్తు పిటిషన్ పై  న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ పిటిషన్ లో  ప్రతివాదులుగా ఉన్న  లింగమనేని కి  నోటీసులు ఇవ్వాలని  ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  తమ వాదనలు వినాలన్న ప్రతివాదులు పిటిషన్ డిస్మిస్ చేసింది.  ఈ కేసులో జప్తు కోసం అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ అధికారిని  విచారణకు రావాలని ఉత్తర్వులు ఇచ్చింది. కేసుకి సంబంధించిన అన్ని వివరాలను తమ ముందు ఉంచాలన్న ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి  వాయిదా వేసింది. 

ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణానదీ కరకట్టపై నివాసం ఉంటున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఇల్లు అటాచ్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇవాళ( జూన్6)  తీర్పు ప్రకటిస్తుందని ఆశించినా కోర్టు మాత్రం మళ్లీ వాయిదా వేసింది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఉండవల్లి కరకట్ట వద్ద గల లింగమనేని ఇంటిని జఫ్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్‌మెంట్ కు అనుమతివ్వాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని జఫ్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించవలసి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. మే 18న నోటీసులు జారీ చేసిన కారణంగా లింగమనేని రమేశ్ కు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.