
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, అయర కొడుకు కార్తీతో పాటు ఈ కేసులో ఇతర నిందితులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. కరోనా ఎఫెక్టు నేపథ్యంలో కోర్టు కేసుల విచారణ ఆన్లైన్లో జరుగుతున్నందుకు సీబీఐ స్పెషల్ కోర్టులో అధికారులు బుధవారం ఈ చార్జిషీట్ దాఖలు చేశారు. తిరిగి కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాక కాగితాల రూపంలో చార్జిషీటు సమర్పించాల్సి ఉంటుందని జడ్జి సూచించారు. 2007లో యూపీఏ ప్రభుత్వంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియాలో భారీగా విదేశీ నిధులను బదిలీ చేయటానికి వీలు కల్పించారని, ఇందుకోసం ఆయన రూ.10 లక్షల వరకు లంచం తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఆయన ఇచ్చిన అనుమతులతో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ నిధులు పొందేందుకు మార్గం సుగమం అయిందని, ఇందులో చిదంబరం కొడుకు కార్తీకి ముడుపులు అందాయని 2017 లో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ మనీ లాండరింగ్ కేసులు పెట్టింది. ఈ కేసులో పోయినేడాది ఆగస్టులో చిదంబరాన్ని సబీఐ అరెస్టు చేయగా డిసెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ ఫైలింగ్ ద్వారా ఈడీ చార్జిషీట్ ఫైల్ చేసింది.