ఎలక్ట్రిక్‌‌ వెహికిల్స్: దేశవ్యాప్తంగా 2,600 చార్జింగ్ స్టేషన్లు

ఎలక్ట్రిక్‌‌ వెహికిల్స్: దేశవ్యాప్తంగా 2,600 చార్జింగ్ స్టేషన్లు

ఈ ఏడాదిలోనే ఏర్పాటు    ప్రతి 4 కిలోమీటర్లకు ఒకటి

నగరాల్లో ఇక నుంచి ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్‌‌ వాహనాల (ఈవీలు) చార్జింగ్ స్టేషన్లే కనిపించనున్నాయి. పలు కంపెనీలు వీటిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నాయి. పెద్ద నగరాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్‌‌ ఏర్పాటు కానుంది. ప్రభుత్వరంగ కంపెనీలు ఈ ఏడాదిలోపే దేశవ్యాప్తంగా 2,600 చార్జింగ్ స్టేషన్లను నిర్మించనున్నాయి.

చాలా కంపెనీలు ఈవీలను తీసుకొస్తున్నప్పటికీ, చార్జింగ్ సదుపాయాలు లేవన్న అసంతృప్తి ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వీటి ఏర్పాటు కోసం ఎన్టీపీసీ, ఈఈఎస్‌‌ఎల్‌‌, ఆర్‌‌ఈఐఎల్‌‌కు ప్రాథమికంగా అనుమతులు ఇచ్చింది. భూమి కోసం ఇవి ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాకే, పూర్తిస్థాయి కాంట్రాక్టులు వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌‌ ఎలక్ట్రానిక్స్ అండ్‌‌ ఇన్‌‌స్ట్రమెంట్స్‌‌ లిమిటెడ్‌‌ అండ్‌‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌‌ఎల్‌‌)కు అత్యధికంగా కాంట్రాక్టులు దక్కాయి. పది లక్షల కంటే ఎక్కువ జనాభా గల 62 నగరాల్లో ఇది చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది.

ఎన్‌‌టీపీసీ, పవర్‌‌గ్రిడ్‌‌ కార్పొరేషన్లు కూడా తక్కువ ధరలకు బిడ్లు వేశాయి. ఇది వరకే 700 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కాంట్రాక్టులు ఇచ్చామని సంబంధిత ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. దీనివల్ల ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్‌‌ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. భారీ పరిశ్రమలశాఖ ఈ కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తుందని చెప్పారు. ఫాస్టర్‌‌ అడాప్షన్‌‌ అండ్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌ (ఫేమ్‌‌)–2 కింద డెహ్రాడూన్‌‌, గౌహతి, తిరుపతి, నవీ ముంబై,భువనేశ్వర్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్లు, పురపాలక సంస్థలు చార్జింగ్ స్టేషన్ల కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ప్రజారవాణా వ్యవస్థలో ఈవీలను, చార్జింగ్ స్టేషన్లను పెంచడానికి సబ్సిడీ స్కీమ్‌‌ ఫేమ్‌‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏర్పాటు చేయబోయే కంపెనీలు

ఆర్‌ఈఐఎల్‌, ఈఈఎస్‌ఎల్‌, ఎన్టీపీసీకి సూత్రప్రాయంగా అనుమతులిచ్చారు.

భూమి కోసం ఇవి ఎంఓయూలు కుదుర్చుకున్నాకే
పూర్తిస్థాయి కాంట్రాక్టులు ఇస్తారు

దీనివల్ల చార్జింగ్ స్టేషన్లు త్వరగా ఏర్పాటవుతాయి