
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్ట్ చనిపోయాడు. ఎస్పీ ఐకే ఎలిసేలా తెలిపిన వివరాల ప్రకారం... పరతాపూర్ పీఎస్ పరిధి అలనార్ అడవుల్లోని గేడాబేడా పర్వతాల్లో మావోయిస్ట్‌లు ఉన్నారన్న సమాచారం అందడంతో బలగాలు కూంబింగ్ మొదలుపెట్టాయి.
బలగాల రాకను గమనించిన మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ మొదలైంది. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత ఘటనాస్థలాన్ని పరిశీలించగా... ఓ మావోయిస్ట్ మృతదేహంతో పాటు 303 రైఫిల్, వాకీటాకీ, మావోయిస్టుల సామాగ్రి కనిపించాయి.
బలగాలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు బ్యాకప్ టీమ్స్‌ను అలనార్ అడవుల్లోకి పంపించారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్ట్ పీఎల్‌జీఏ మిలటరీ కంపెనీ నంబర్ 5 సభ్యులు మాసా అని, అతడిపై రూ. 8 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు.