
ఈసారి ఆస్కార్ అవార్డ్స్‌కి మనదేశం నుంచి ఏ సినిమా వెళ్లబోతోందన్న విషయంపై చాలా పెద్ద చర్చే నడిచింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఆస్కార్ బెస్ట్ ఫీచర్ ఫిలిం విభాగంలో గుజరాతీ మూవీ ‘‘ఛెల్లో షో’’ (ఇంగ్లీషులో ‘లాస్ట్ ఫిల్మ్ షో’) అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన పాన్ నళిన్(నళిన్ కుమార్ పాండ్యా)కి ఎన్నో అవార్డు విన్నింగ్ మూవీలు తీసిన డైరెక్టర్‌గా పేరుంది. ఆ విషయాలన్నీ ఆయన మాటల్లోనే..
“ ‘ఛెల్లో షో’ 95 వ ఆస్కార్ అవార్డ్స్‌కి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అది ఊహించుకుంటేనే పట్టలేనంత సంతోషంగా ఉంది. దీనికంటే ముందు రాబర్ట్ డినిరోస్ (టిబెకా ఫిల్మ్ ఫెస్టివల్) తో పాటు మరెన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ చాలా విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది మా సినిమా. వాటిలో స్పెయిన్‌లో జరిగిన వాల్లడాయిడ్ ఫిల్మ్ ఫెస్టివల్, నార్వే ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. ఒక్కో అవార్డు వస్తుండేసరికి, మా చేతిలో అద్భుతమైన కథ ఉందని రియలైజ్ అయ్యాం. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేరు. పెద్ద ప్రొడక్షన్ హౌజ్ కూడా కాదు. అయినా సరే, మేం ఇంత పెద్ద విజయం సాధించినందుకు గర్వంగా ఉందం’’టున్న పాన్ నళిన్ ఆటో బయోగ్రఫీయే ఈ సినిమా అట. ‘‘నేను పెరిగిన బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఈ సినిమా పుట్టింద’’ని చెప్తున్నాడు ఈ డైరెక్టర్.
టీ స్టాల్లో పనిచేశా
‘‘గుజరాత్, అమ్రెలీ జిల్లాలోని అడ్తల అనే చిన్న గ్రామం మాది. ఆకాశం, ఎగిరే విమానాలు తప్ప ఇంకేం లేని చోటు అది. మా అమ్మ వంట బాగా చేస్తుంది. నాన్న తనకున్న కొద్ది పొలం, ఆవులు చూసుకునేవాడు. కొన్నాండ్లకు వాటినీ నాన్న వాళ్ల అన్నదమ్ములు లాక్కున్నారు. చేసేదేంలేక ఖాళీ చేతులతో వెళ్లి ఊరి చివర్లో ఉన్న ఖాజాడియా జంక్షన్ రైల్వే స్టేషన్లో టీ స్టాల్ పెట్టాడు నాన్న. నాకు పన్నెండేండ్లు వచ్చేవరకు నాన్న నడిపే టీ స్టాల్లో పనిచేశా. స్కూల్ అంటే ఇష్టం ఉండేది కాదు నాకు. అందుకనే క్లాస్ రూంకి వెళ్లింది చాలా తక్కువ. ఎక్కువ టైం పెయింటింగ్ వేస్తూ గడిపేవాడిని. పౌరాణిక, జానపద నాటకాల్లో నటిస్తుండేవాడిని. బరోడాలోని ఎ.ఎస్. యూనివర్సిటీలో ఒక సంవత్సరం ఫైన్ ఆర్ట్స్ కూడా చదివా. అప్పుడే సినిమా ప్రపంచం పరిచయమైంది. ఆ తర్వాత ఏడాది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ) అహ్మదాబాద్‌లో డిజైన్ కోర్సు చదివేందుకు వెళ్లా. ఎన్ఐడీలో ఉన్నప్పుడు సినిమాల గురించి రాయడం మొదలుపెట్టా. ఒక ఫిల్మ్ క్లబ్లో వరల్డ్ సినిమాలని గురించి రాశా.
పాత కెమెరాలతో డాక్యుమెంటరీలు
నా చదువు ఖర్చు, సినిమా కలలు నాన్నకి భారం కాకూడదు అనుకున్నా. అందుకే వాటికోసం వెడ్డింగ్ వీడియోలు చేశా. అహ్మదాబాద్ పాత బజార్లో కెమెరాలు తీసుకొని, పైలెట్‌గా నాలుగు యానిమేషన్స్, ఇరవై షార్ట్ ఫిల్మ్స్ తీశా. ఎడిటింగ్, ల్యాబ్ వర్క్, సౌండ్ లేకపోవడం వల్ల అవి అలానే ఉండిపోయాయి. ఆ తర్వాత ముంబై వెళ్లి, ఒక ప్రొడక్షన్ హౌజ్‌లో చేరా. అక్కడి ప్రొడ్యూసర్స్ నా టాలెంట్ గుర్తించి యాడ్స్, కార్పొరేట్ సినిమాలు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత యూఎస్‌లో ఆరునెలలు ఉన్నా. మళ్లీ ఇండియాకి తిరిగొచ్చి కథలు రాయడం, డాక్యుమెంటరీలు తీయడం మొదలుపెట్టా. వాటిలో చాలా డాక్యుమెంటరీలు డిస్కవరీ, కెనాల్ ప్లస్, బీబీసీతో పాటు ఇతర లీడింగ్ టీవీ నెట్‌వర్క్స్‌లో టెలికాస్ట్ అయ్యాయి. షారుక్ ఖాన్, శ్రీదేవి లాంటి పెద్ద స్టార్స్ గురించి డాక్యుమెంటరీలు తీశా. నాగాలాండ్, టిబెట్, హిమాలయాల మీద కూడా తీశా.
1992 “బార్న్ క్రిమినల్” మూవీకి కో– ప్రొడ్యూసర్‌గా నా సినిమా ప్రయాణం మొదలుపెట్టా. ఆ తర్వాత కూడా చాలా డాక్యుమెంటరీలు తీశా. వాటిల్లో 2001లో తీసిన ‘‘సంసార”మూవీ నాకు బ్రేక్ ఇచ్చింది. 2006 లో తీసిన “వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్”35 దేశాల్లో ఆడింది. చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించాం. 2013 లో ‘కుంభ్ మేళా”డాక్యుమెంటరీ, 2014 లో తీసిన “యాంగ్రీ ఇండియన్ గాడెసెస్” సూపర్ హిట్ అయ్యాయి. వాటిని టొరొంటో ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌తో పాటు అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించాం.
మనసుని తాకుతోంది
ఇండియా చాలా పెద్దగా ఆలోచిస్తుందని ప్రపంచానికి చాటి చెప్తుంది ‘ఛెల్లో షో’. పెద్ద చరిత్ర సృష్టించాలనుకునే వ్యక్తిని, ఏదీ ఆపలేదు అనే మెసేజ్‌తో ఈ సినిమా సాగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా “మీ కలని అనుసరించండి విజయం వరిస్తుంది’’ అని మెసేజ్ ఇస్తుంది. దీన్ని కూడా చాలా సింపుల్‌గా, ఆర్గానిక్‌గా చెప్పాం. ఈ సినిమా తీయడానికి మూడున్నరేండ్లు పట్టింది. మన దగ్గర ఈ సినిమాని థియేటర్ రిలీజ్ చేయడం చాలా కష్టమైంది. గత కొన్ని వారాలుగా చాలా పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. అందుకే మొదట విదేశాలకెళ్లి, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అక్కడ ఈ సినిమా చూసినవాళ్లంతా... ఇలాంటి సినిమా ఇంతకుముందు చూడలేదని చెప్పారు. ఇండియాలో మేం స్ర్కీనింగ్ చేసిన అన్ని సిటీలలోనూ అచ్చంగా ఇలాంటి స్పందనే వచ్చింది. త్వరలో మన దగ్గర మరిన్ని థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నాం. ఇటలీలో కూడా విడుదల కాబోతుంది. వచ్చే నవంబర్‌లో యూఎస్‌లో విడుదల చేస్తున్నాం. 2023 జనవరిలో జపాన్ థియేటర్లలో విడుదల కాబోతుంది. సినిమా ప్రతి ఒక్కరి మనసుని తాకుతుందని నేను నమ్ముతున్నా. పాండెమిక్ ఫేజ్ తర్వాత సినిమాలు చూడాలి అనుకునేవాళ్లందరికీ ఇదొక ‘రిఫ్రెషింగ్’ అన్నమాట!
ఆస్కార్‌కి బ్యాగ్ సర్దుకోమన్నారు
ఈ సినిమా ఆస్కార్‌కి వెళుతుందని మేం కలలో కూడా ఊహించలేదు. కానీ, ఇండస్ట్రీ మొత్తంలో ఈ కథను నమ్మింది మాత్రం సిద్ధార్థ్ రాయ్ కపూర్. ఈ కథ వినగానే ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు ఆయన. కథ విన్నాక ‘నేను ఇప్పటివరకు హిందీ సినిమాలు మాత్రమే ప్రొడ్యూస్ చేశా. ఇప్పటి నుంచి ఈ రూల్ బ్రేక్ చేస్తున్నాన’ని చెప్పాడు. ‘లగాన్’ మూవీ డైరెక్టర్ అశుతోష్ గోవరికర్ ఐదు నెలల క్రితం మాతో మాట్లాడుతూ ‘‘మీరు బ్యాగులు సర్దుకోండి. మీకు ఆస్కార్స్ రాబోతున్నాయి” అన్నారు. మేం నవ్వి, మర్చిపోయాం. ఇప్పుడు నిజంగానే ఆస్కార్ ఫంక్షన్‌కి వెళ్లేందుకు రెడీ అయ్యాం!
కాన్ఫిడెన్స్‌తో పనిచేయాలి
ఆధ్యాత్మికత మన సంస్కృతిలోనే ఉంది. అందుకే నేను ఏ సినిమా తీసినా అందులో ఆధ్యాత్మికత ఉండేలా చూసుకుంటా. అలాగే మంచి స్టోరీస్‌కి ఎప్పుడూ అట్ట్రాక్ట్ అవుతా. నేను ఒకేసారి రెండు మూడు కథల మీద పని చేస్తా. అవి చేస్తూనే సినిమాలు, కమర్షియల్స్ చేశా. కొన్నాళ్ళు నాటకాల్లో కూడా నటించా. కాబట్టి, నేను ఏ స్క్రిప్ట్ రాసుకున్న అందులోని పాత్రల్ని, వాటి ఎమోషన్స్‌ని ఫీల్ అవుతుంటా. వాటిని నా ప్రాజెక్ట్స్‌లో నటించే నటీనటులకి వివరిస్తా. ‘దాదాపు ప్రపంచం అంత తిరిగారు కదా ఏం నేర్చుకున్నారు, ఏం సందేశం ఇస్తారు’ అని చాలామంది అడుగుతుంటారు. వాళ్లందరికీ నేను ఇచ్చే ఒకే ఒక సలహా – మీరేం చేస్తున్నారో, దాన్ని నమ్మండి. అది ఏ పనైనా సరే, దానిపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో పని చేయండి. మీరు చేస్తున్న పనిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటే, కచ్చితంగా ఆ పనిచెయ్యడం ఆపేయండి’’ అని చెప్పాడు పాన్ నళిన్.
‘ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి.. ‘ ది కశ్మీర్ ఫైల్స్’
‘ఆర్.ఆర్.ఆర్.’, ‘గంగూభాయ్ కతియవాడి’ గురించి మాట్లాడుతుంటే మీ మూవీ సెలక్ట్ అయింది కదా! మీ కామెంట్ ఏంటి?’ అని అడిగారు కొందరు. దానికి నా సమాధానం “నో కామెంట్’’. ఎందుకంటే 17 మందితో ఉన్న జ్యూరీ ఈ మూవీనీ సెలక్ట్ చేసింది. అది వాళ్లందరి ఏకగ్రీవ ఎంపిక. అలాగే జీవితంలో ఏదైనా కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. గ్రామాన్ని విడిచిపెట్టాలని ఈ సినిమాలో చెప్పడం వల్ల దాని గురించి కూడా అడుగుతున్నారు. ఇది నా జీవితంలో నిజమైంది. ఇంకా లక్షలమంది పిల్లల్లో కూడా నిజమవుతుంది. భూస్వామి, రాజకీయ నాయకుడు, వ్యాపారి... ఈ మూడింటిలో ఏదీ కానివారికి గ్రామాల్లో జీవితం లేదు. చాలామంది దీన్ని ఒప్పుకోరని తెలుసు. అయినా కూడా చాలా ఆఫ్రికా దేశాలకు ఇదే వర్తిస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
::: గుణ