
చెన్నై: కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో 2017లో జరిగిన వరుస హత్యలు, దోపిడీల కేసుకు సంబంధించి చెన్నై పోలీసులు శశికళను ప్రశ్నించారు. చెన్నై టీ-నగర్లోని శశికళ నివాసంలో ఈ విచారణ జరిగింది. కొడనాడు ఎస్టేట్లో సెక్యురిటీ గార్డ్ హత్య జరిగిన సమయంలో ఆ బంగ్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే అదే బంగ్లాలో మరో నలుగురు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. గతంలో జయలలిత డ్రైవర్గా పనిచేసిన కనకరాజ్ కారు ప్రమాదంలో మృతి చెందగా.. ఎస్టేట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు కొడనాడు దొంగతనం, మర్డర్ కేసుల్లో విచారణ జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ క్రమంలో పోలీసులు శశికళను విచారించారు.