- నాడు ఇందిరాగాంధీ.. నేడు కాంగ్రెస్ వెంట నడిచింది మాలలే: వివేక్ వెంకటస్వామి
- 30 లక్షల సంఖ్యా బలమున్నా మనకు అన్యాయమే జరుగుతోంది
- మాలలను ఐక్యం చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకం
- మాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూరు ఎమ్మెల్యే
వరంగల్/హసన్పర్తి, వెలుగు: మాల సామాజికవర్గం అంటేనే డెసిషన్ మేకర్స్ అని.. రాష్ట్రంలో సంఖ్యాపరంగా 30 లక్షల మంది ఉన్నా.. అన్యాయమే జరుగుతోందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలలు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ చింతగట్టులో మాల, మాల ఉప కులాలు, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి వివేక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. 1978లో ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ) అనే పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం నుంచి కాకా వెంకటస్వామి, కర్నాటక నుంచి శంకర్ ఆనంద్ లాంటి మాల నేతలు ఆమె వెంట నడిచారని, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా మాలల పాత్ర గణనీయంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొందరు కావాలనే మాలలు తక్కువ ఉన్నారంటూ ఢిల్లీ స్థాయి నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న మాలలు తమ బలం చూపించలేకపోవడం వల్లే న్యాయంగా దక్కాల్సిన అవకాశాలను కోల్పోతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు మాల సామాజిక వర్గం బలమేంటో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు మాలలకు సరైన గుర్తింపు ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో అందరికి అందుబాటులో ఉండే మాల ఉద్యోగుల పాత్ర ఎక్కువగా ఉందని.. వారంతా మాలల ఐక్యత కోసం పాటుపడాలని సూచించారు.
వర్ధన్న పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ... దేశంలో ఆర్ఎస్ఎస్ మనువాదం నడుస్తుందని.. రిజర్వేషన్లపై ఆ సంస్థ కుట్ర చేస్తోందని ఆరోపించారు. భవిష్యతులో మన పిల్లల కడుపుకొట్టకుండా ఉండాలంటే మాల లు ఇప్పటికైనా మేల్కోవాలన్నారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్ పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.