Chess World Cup 2023 Final: వరల్డ్ నెం.1కే చెమటలు పట్టించిన ప్రజ్ఞానంద.. తొలి గేమ్ డ్రా

Chess World Cup 2023 Final: వరల్డ్ నెం.1కే చెమటలు పట్టించిన ప్రజ్ఞానంద.. తొలి గేమ్ డ్రా

ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌‌లో తొలి గేమ్ డ్రాగా ముగిసింది. తన ముందు కూర్చుంది ప్రపంచ నంబర్‌వన్‌ చెస్ ప్లేయరైన..  భారత యువ సంచలనం, 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఏమాత్రం తడబడలేదు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ మాగ్నస్‌ కార్ల్‌సన్‌‌కు చెమటలు పట్టించాడు. గేమ్‌లోని 35వ‌ మూవ్ వ‌ద్ద పరస్పర అంగీకారంతో ఇద్ద‌రు ఆట‌గాళ్లు డ్రాతో తెరదించారు. బుధవారం(ఆగష్టు 23) రెండో గేమ్‌లో మరోసారి తలపడనున్నారు.  

అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరుగుతోన్న ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్‌వన్‌ చెస్ ప్లేయర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. తుది పోరులో ప్రజ్ఞానంద తెల్ల పావులతో ఆడగా.. కార్ల్‌సన్‌ నల్ల పావులతో ఆడారు. తొలి గేమ్‌ డ్రా కావడంతో.. రెండో గేమ్‌లో రేపు మరోసారి తలపడనున్నారు. అయితే రెండో గేమ్‌లో కూడా ఫలితం తేలకపోతే తుది పోరు టై బ్రేక్‌కు వెళ్లనుంది.