వనాల్లో అమ్మలకు జనాల పబ్బతి

వనాల్లో అమ్మలకు జనాల పబ్బతి

చత్తీస్​గఢ్​, తెలంగాణ, ఏపీ.. ఇలా రాష్ట్రమేదైనా ఆదివాసీల్లో మాతృ దేవతలను ఆరాధించడం కామన్​గా కనిపిస్తుంది. బయటి నుంచి చూస్తే గిరిజనులంతా ఒకే సమూహంగా కనిపించినా వారిలోని తెగలు, గట్టు, గోత్రాలను బట్టి వేర్వేరు దేవతలను పూజిస్తుంటారు. మెజార్టీ దేవతలు స్త్రీలు.. వాళ్లంతా తమ పూర్వీకులే కావడం విశేషం. బయట ఆలయాల్లో జరిగే జాతరలు, ఉత్సవాలు, దేవతల కల్యాణాలకు ఆదివాసీల జాతరలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. మంత్రోచ్ఛరణలు, హంగులు, ఆర్భాటాలు ఉండవు. ఉత్సవాల నిర్వహణ, ఆచార, సంప్రదాయాల్లో ఆదివాసీలకు ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. రాష్ట్రంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని కోయ, గోండు, చెంచు, కోలం, ప్రధాన్, తోటి, ఆంద్, మన్నెవార్, నాయకపోడు, కొండ రెడ్లు, సవరలు తదితర 32 తెగల ప్రజలు 32 మంది వేల్పులను పూజిస్తారు. ఒక తెగ చేసుకునే జాతరకు మిగతా తెగల వాళ్లు వస్తారు. మేడారం సమ్మక్క, ఆసిఫాబాద్​లో జంగుబాయి, ఆదిలాబాద్​లో నాగోబా, చత్తీస్ గఢ్ లో దంతేశ్వరీమాత, ఏపీలోని విశాఖ ఏజెన్సీలో ధారాళమ్మ, మహారాష్ట్రలోని చంద్రపూర్​లో మహంకాళి జాతరలన్నీ ఆదివాసీల జాతరలే. ఆదివాసీలు పవిత్రంగా భావించే మాఘ శుద్ధ పౌర్ణమికి అటు, ఇటుగా జనవరి, ఫిబ్రవరిలోనే నిర్వహిస్తారు. వన దేవతల జాతరలకు నాలుగైదు దశాబ్దాలుగా ఆదివాసేతరుల రాక పెరగడంతో నాడు వేలల్లో ఉండే భక్తుల సంఖ్య నేడు లక్షల్లోకి చేరింది.

ఆసియాలోనే అతిపెద్ద జాతర ‘మేడారం’

ములుగు జిల్లా మేడారంలో జరిగే జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సమ్మక్క, సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజులను భక్తులు కొలుస్తారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. రెండేళ్ల కింద జరిగిన మహా జాతరకు కోటి 30 లక్షల మంది వచ్చారని ఆఫీసర్లు చెప్పారు. ఈసారి అంతకు మించి వచ్చే అవకాశం ఉందని అంచనా. జాతర 16న ప్రారంభమై 19న తల్లులు చిలకలగుట్టను తిరిగి చేరడంతో ముగుస్తుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ రావడం, చిలకల గుట్ట నుంచి సమ్మక్క ఆగమనం జాతరలో అద్భుత ఘట్టాలు. లక్షలాది భక్తుల తన్మయత్వం, చత్తీస్ గఢ్ నుంచి వచ్చే ఆదివాసీలు, గుత్తికోయల నృత్యాల మధ్య సారలమ్మ రావడం అద్భుతంగా అనిపిస్తుంది.

చంద్రపూర్ లో మహంకాళి

తెలంగాణ సరిహద్దు, గోదావరికి అవతలి వైపు ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కేంద్రంలో మహంకాళి జాతర కనుల పండువగా జరుగుతుంది. మహంకాళి అమ్మవారిని గోండులు కాళీ కంకాళీగా కూడా పిలుస్తారు. గోండు తెగలోని ఆత్రం వంశీయులు ఏటా చైత్ర మాసంలో 3 రోజులపాటు మహంకాళి జాతర నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మల్లాగే  మహంకాళిని గోండులు వనదేవతగా పూజిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్​గఢ్ రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది ఈ జాతరకు వెళ్తారు.

మహరాజ్​గూడలో జంగుబాయి

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహరాజ్ గూడ సహ్యాద్రి పర్వత ప్రాంతంలో జంగుబాయి తల్లికి, ఇదే మండలంలోని కప్లాయి చీకటి గుహలో కొలువైన భీమదేవుడికి ఏటా ప్రత్యేక పూజలు చేస్తారు. జంగుబాయి పేరిట ఏటా పుష్య మాసంలో నెలవంక కనపడగానే(జనవరి మొదటి వారంలో) జాతర మొదలవుతుంది. సమ్మక్కను కుంకుమ భరిణగా కొలిస్తే.. జంగుబాయిని దీపం, పెద్దపులి రూపంలో పూజిస్తారు. గోండులంతా మాఘ శుద్ధ పౌర్ణమి రాగానే నెల రోజుల పాటు జంగుబాయి మాలలు వేస్తారు. జాతరకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది ఆదివాసీలు వస్తుంటారు. భీమదేవుడికి కూడా పుష్య మాసంలోనే జాతర నిర్వహిస్తారు. గోండు, ప్రధాన్‌‌‌‌, కొలాం తెగకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా దర్శించుకుంటారు.

దంతేవాడలో దంతేశ్వరి మాత

చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా దంతేవాడలో దంతేశ్వరి మాత కొలువై ఉంది. దంతేశ్వరి అమ్మవారిపేరు మీదనే ఈ ప్రాంతానికి దంతేవాడ అని పేరొచ్చింది. దేశంలోని 52 శక్తి పీఠాల్లో దంతేశ్వరి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కోయ తెగ ఆదివాసీలు ఏటా ఫిబ్రవరిలో 3 రోజులపాటు జాతర నిర్వహిస్తారు. అక్కడి ఆదివాసీలు చెప్పే గాథల ప్రకారం దంతేశ్వరి మాతను వారు సమ్మక్కగా కొలుస్తారు. మేడారంలో లాగే దంతేశ్వరిమాతకు కొబ్బరి కాయలు, బంగారం(బెల్లం) కానుకలుగా సమర్పిస్తారు. కోళ్లు, మేకపోతులు బలిస్తారు. జాతరకు 3 లక్షలకు పైగా జనం వస్తుంటారు.