సర్వే రిపోర్ట్ : పిల్లలను పట్టించుకోట్లే!

సర్వే రిపోర్ట్ : పిల్లలను పట్టించుకోట్లే!

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు పిల్లల హక్కులను పట్టించుకోవట్లేదు. ఇండియా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. బ్రిటన్, న్యూజిలాండ్​ వంటి దేశాలు పిల్లల హక్కుల విషయంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. 181 దేశాలపై సంస్థ సర్వే చేస్తే 170వ స్థానంలో బ్రిటన్​ నిలిచింది. న్యూజిలాండ్​ 169వ ర్యాంకు సాధించి అడుగున నిలిచాయి. ఇండియా గత ఏడాదితో పోలిస్తే మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 117వ స్థానంలో నిలిచింది. అయినా ఈ విషయంలో పక్క దేశం బంగ్లాదేశ్​ కన్నా మనం వెనకబడే ఉన్నాం. ఆ దేశం 108వ ర్యాంకు సాధించింది. పాకిస్థాన్​ 151వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయంలో ఐస్లాండ్​ 0.967 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పిల్లలపై శ్రద్ధ పెడుతున్న దేశంగా పేరు తెచ్చుకుంది. రెండో స్థానంలో పోర్చుగల్​, మూడో స్థానంలో స్విట్జర్లాండ్​ ఉన్నాయి. నాలుగు, ఐదు ర్యాంకులను ఫిన్లాండ్​, జర్మనీ దక్కించుకున్నాయి. పిల్లల హక్కుల్లో ఆఫ్గనిస్థాన్​ చిట్టచివరి స్థానం (181)లో నిలిచింది.

ఆ ఐదు విషయాలపైనే…

ఐదు విషయాల ప్రాతిపదిక కిడ్స్​రైట్స్​ సంస్థ సర్వే చేసింది. జీవితపు హక్కు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు, భద్రతా హక్కు, పిల్లల హక్కులకు సరైన వాతావరణం సృష్టించడం వంటి విషయాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు, స్కోర్లు ఇచ్చింది. అయితే, 2013 నుంచి ఇప్పటిదాకా పిల్లల హక్కులపై ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యల్లో ఎలాంటి మార్పు రాలేదని సర్వే తేల్చింది. ఆర్థికంగా గట్టిగా ఉన్న దేశాల్లోనూ పిల్లల హక్కులు అంతంత మాత్రమేనని, వాటి కన్నా ఇప్పుడిప్పుడే అభివృద్ధి మార్గంలో వెళుతున్న దేశాలే మేలని సర్వే సూచించింది. పిల్లల సంరక్షణ, హక్కుల కోసం సరైన బడ్జెట్​ను కేటాయించట్లేదని నిర్ధారించింది.  జాబితాలో జీడీపీ ఎక్కువగా ఉన్న దేశాలు మంచి ర్యాంకులను సాధించినట్టు నివేదిక పేర్కొంది. అయితే, ఆర్థిక వనరులు ఎక్కువగా ఉన్నా పిల్లల హక్కుల్లో మాత్రం పెరుగుదల ఉందనేందుకు సరైన ఆధారాలేవీ లేవని చెప్పింది.

పిల్లలపై వివక్ష

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పిల్లలపై వివక్ష చూపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. పిల్లలపై ప్రభావం చూపించే అంశాల్లో నిర్ణయాలను తీసుకోవడంలో పిల్లలను భాగం చేయట్లేదని ఆరోపించింది. మరీముఖ్యంగా అమ్మాయిలు, శరణార్థులు, వలస పిల్లలు, ఎల్​జీబీటీక్యూఐ పిల్లలు, దివ్యాంగుల విషయంలో అంటీ ముట్టనట్టు ఉంటున్నాయని తెలిపింది. ఏ దేశమూ అందుకు మినహాయింపు కాదని, అన్ని దేశాల్లోనూ అదే దుస్థితి ఉందని పేర్కొంది. ఇతర పిల్లల్లాగా వాళ్లకూ చదువు, ఆరోగ్యం వంటి విషయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించట్లేదని చెప్పింది.