- అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరలో హైస్పీడ్ ట్రాక్ నిర్మించిన డ్రాగన్
బీజింగ్: బార్డర్ ఏరియాలో పట్టు బిగించేందుకు ఇండియా- టిబెట్ బార్డర్‌లో చైనా బుల్లెట్ రైలు ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్చీ వరకు పూర్తి ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలును తీసుకొచ్చింది. టిబెట్‌లో ఇదే తొలి బుల్లెట్ ట్రైన్. ఒకవేళ ఇండియా--చైనా బార్డర్‌లో ఎమైనా గొడవలు జరిగితే చైనా బలగాలు అక్కడికి చేరుకునేందుకు ఈ ట్రైన్ ఉపయోగపడుతుందని అక్కడి అధికారులు చెప్పారు. జులై 1న నిర్వహించనున్న అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) వందేళ్ల వేడుకల సందర్భంగా 435.5 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ ట్రాక్‌ను చైనా శుక్రవారం ప్రారంభించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు మొత్తం 9 చోట్ల ఆగనుంది. ప్రయాణికులు, సరుకు రవాణాకు ఈ రైలు చాలా ఉపయోగపడుతుందని చైనా చెబుతోంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయొచ్చని, దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజల జీవితాలు మెరుగుపడుతాయని చెప్పింది. ఈ రైలు ద్వారా లాసా-నింగ్చీల మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గనుంది. అలాగే షన్నన్ నుంచి నింగ్చీల మధ్య ట్రావెల్ టైమ్ 6 గంటల నుంచి దాదాపు 2 గంటలకు తగ్గింది. గతంలో చెంగ్డూ నుంచి లాసా వెళ్లేందుకు 48 గంటల సమయం పడుతుండగా, తాజాగా 13 గంటలకు తగ్గింది. ఈ రైలు మార్గంలో 47 టన్నెల్స్, 121 బ్రిడ్జిలు ఉన్నాయి. స్థానికంగా యార్లుంగ్ జాంగ్బో అని పిలిచే బ్రహ్మపుత్ర నదిని ఈ రైలు 16 సార్లు దాటుతుంది. మొత్తం రైల్వే మార్గంలో 75% టన్నెల్స్, బ్రిడ్జిలే ఉన్నాయి. సిచువాన్-టిబెట్‌లో నిర్మించిన రెండో రైలు మార్గం ఇది. గతంలో క్వింఘాయ్- టిబెట్ రైల్వే మార్గాన్ని ప్రారంభించారు.
