విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేయనున్న చైనా

విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేయనున్న చైనా

జీరో కోవిడ్ పాలసీతో మూడేళ్లుగా జనాన్ని ఇబ్బంది పెడుతున్న చైనా ప్రభుత్వం ఎట్టకేలకూ రూటు మార్చింది. కొత్త  ఏడాదిలో సరికొత్త నిర్ణయాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. జనవరి 8 నుంచి ప్రయాణికులపై నిషేధాన్ని తొలగించనున్నట్లు చైనా అధికారులు తెలిపారు. జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు. జీరో కోవిడ్ పాలసీ విధానం కారణంగా చైనాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు ప్రజలు అసంతృప్తికి కారణమైంది. మరోవైపు విద్యావ్యవస్థపైనా ప్రభావం చూపింది. చివరికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై ప్రజలు నిరసన జ్వాలలు వ్యక్తం చేశారు. దీంతో కొద్ది రోజుల తర్వాత కోవిడ్ నిబంధనలను తొలగించారు. కాని సరిహద్దులను మాత్రం మూసివేసి ఉంచారు. తాజాగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ సరిహద్దులను తెరవాలని నిర్ణయించారు.

చైనాకు రావాలనుకునే వ్యక్తులెవరైనా కోవిడ్ నెగిటివ్ రిపోర్టుతో రావచ్చని.. జిన్ పింగ్ ప్రభుత్వం చెప్పింది. ఐదు రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాత తమ కుటుంబసభ్యులను కలుసుకోవచ్చని ప్రకటించింది. అలాగే.. వ్యాపారాలు, చదువుల కోసం చైనాకు వెళ్లాలని అనుకునే విదేశీయులకు వీసా దరఖాస్తులను సులభతరం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే.. టూరిజంకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ విమానాల సంఖ్య, ప్రయాణికుల సామర్థ్యం పై ఉన్న పరిమితులను కూడా తొలగించనున్నట్లు చైనా ప్రకటించింది. అయితే వైరస్ వ్యాప్తిని మాత్రం ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటామని జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. కోవిడ్ ఇన్ ఫెక్షన్ ను నివారించడం పైనే తమ మొదటి ప్రాధాన్యత అని చైనా ఆరోగ్య అధికారి లియాంగ్ వనియన్ తెలిపారు. 

2020 ప్రారంభంలో చైనా విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించినప్పటి నుండి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చైనా పర్యాటకులపై ఆధారపడిన అనేక దేశాలకు పర్యటక రంగంలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు కోవిడ్ జీరో పాలసీ విధానంపై చైనా యూటర్న్ తీసుకోవడంతో.. ఆర్థిక వేత్తలు, పెట్టుబడిదారుల్లో అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వద్ద ఆర్థిక వృద్ధి పై ఎలాంటి ప్రభావం పడనుంది అనేది చూడాల్సి ఉంది.