కరోనా పేషెంట్లతో..చైనాలో దవాఖాన్లు ఫుల్

కరోనా పేషెంట్లతో..చైనాలో దవాఖాన్లు ఫుల్

బీజింగ్:  కరోనా పేషెంట్లతో చైనా దవాఖాన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసిన తర్వాత దేశంలో వైరస్ బారినపడుతున్న వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. చాలా ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోక ఒక్కో బెడ్​పై ఇద్దరు పేషెంట్లను ఉంచి, కొన్ని చోట్ల నేలపై ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్న సీన్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. చోంక్వింగ్ సిటీలోని ఓ ఆస్పత్రిలో ఏకంగా ఓ పేషెంట్​ను నేలపైనే ఉంచి డాక్టర్లు సీపీఆర్ చేస్తూ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన వీడియో.. మరో ఆస్పత్రిలో పేషెంట్లను చూస్తూనే వర్క్ లోడ్​తో అలసిపోయిన డాక్టర్ స్పృహ తప్పిపడిపోయిన వీడియో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా ఆంక్షలు ఎత్తేయడంతో టీకాలు వేసుకోని వాళ్లంతా వైరస్ బారిన పడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన కేస్ లోడ్​లను తట్టుకునేలా ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేయక, ఎక్విప్ మెంట్లు, సౌలతులు లేక డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు మెడికల్ షాపుల్లో మందులకు కూడా తీవ్ర కొరత ఏర్పడుతోంది. కరోనా వల్ల శ్వాస ఇబ్బంది తలెత్తి చనిపోతేనే.. దానిని కొవిడ్ డెత్​గా నమోదు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కరోనా ఎఫెక్ట్ తో ఎంతోమంది చనిపోతున్నా.. అధికారులు ఒకటి, రెండు డెత్స్ మాత్రమే నమోదు చేస్తున్నారు. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మంగళవారం దేశవ్యాప్తంగా 3,101 కేసులు నమోదు కాగా, జీరో డెత్స్ నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 3,86,276 కేసులు రికార్డ్ కాగా, మొత్తం 5,241 మంది చనిపోయారు. అయితే, వాస్తవ లెక్కలు మాత్రం ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. 

డెత్స్ 15 లక్షలకు పెరుగుతయ్ 

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. చైనాలో లక్షల మంది కరోనాతో చనిపోయే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎస్ఈఐఆర్ మోడలింగ్ ప్రకారం దేశంలో కరోనా వల్ల 15 లక్షల మంది చనిపోవచ్చని ‘ది ఎకనమిస్ట్’ వెల్లడించింది. చైనా రీఓపెన్ తర్వాత పరిస్థితిని బట్టి.. 13 లక్షల నుంచి 21 లక్షల మధ్య మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ‘ది లాన్సెట్’ వెల్లడించింది. 

3 నెల్లలో 3 వేవ్స్ వస్తయ్ 

చైనాలో 3 నెలల్లో 3 కరోనా వేవ్స్ విజృంభిస్తాయని హెల్త్ ఎక్స్ పర్ట్​లు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడిపై చైనా ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్ కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. జనవరిలో ఫస్ట్ వేవ్ వస్తుందని, ఆ వెంటనే జనవరి లాస్ట్ వీక్ నుంచి సెకండ్ వేవ్ కొనసాగుతుందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కు చెందిన చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్యోయూ వెల్లడించారు. ఇక ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చిలో థర్డ్ వేవ్ వస్తుందన్నారు.