వూహాన్ నుంచి వెళ్లిపోతున్నరు

వూహాన్ నుంచి వెళ్లిపోతున్నరు
    • వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేసిన చైనా
    • 73 రోజుల తర్వాత ఆంక్షల సడలింపు
    • వేలాది మంది వూహాన్ ను విడిచి వెళ్లే ప్రయత్నం
    • సిటీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

బీజింగ్/వూహాన్: కరోనా వైరస్ కు ఎపిక్ సెంటర్ అయిన వూహాన్ లాక్ డౌన్ ను చైనా పూర్తిగా ఎత్తేసింది. 73 రోజుల తర్వాత ఈ సిటీలో ఆంక్షలను బుధవారం డ్రాగన్ కంట్రీ సడలించింది. దీంతో వేలాది మంది వూహాన్ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వెయ్యికిపైగా కొత్త కేసులు చైనాలో రికార్డు కాగా.. షాంఘైలో ఒకరు, హుబెయిలో మరొకరు మృతి చెందారు.

మంగళవారం 1,042 కేసులు
మంగళవారం చైనాలో 1,042 కేసులు నమోదైనట్లు చైనీస్ హెల్త్ అథారిటీస్ ప్రకటించాయి. ఇందులో 137 మందికి ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా పాజిటివ్ వచ్చినట్టు నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్ హెచ్సీ) వెల్లడించింది. ఇలాంటి లక్షణాలు కలిగిన 1,095 మెడికల్ అబ్జర్వేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్ బయటపడిన తర్వాత సోమవారం ఒక్క డెత్ కూడా రికార్డు కాలేదు. అయితే మంగళవారం ఇద్దరు చనిపోవడంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 3,333కు చేరింది. మొత్తం కేసులు 81,802కు పెరిగాయి. వీరిలో 1,190 మందికి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుండగా.. 77,279 మంది రికవర్ అయ్యి హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

జనవరి 23 నుంచి అన్నీ బంద్
డిసెంబర్ చివరిలో వూహాన్ లో తొలి కరోనా కేసును గుర్తించినట్టు రెండ్రోజుల క్రితం చైనా ప్రకటించింది. జనవరి 23న లాక్ డౌన్ ప్రకటించడంతో 1.1 కోట్ల మంది వూహాన్ సిటీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. హుబెయి ప్రావిన్స్ లో ఇప్పటి వరకూ 67,803 కేసులు నమోదు కాగా.. ఇందులో 50 వేలకుపైగా కేసులు ఒక్క వూహాన్ సిటీలోనే రికార్డయ్యాయి. జనవరి 23 నుంచి వూహాన్ లో ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి. ఫ్లైట్స్, ట్రైన్ల తో పాటు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కూడా బందయ్యింది. ఒకేసారి లాక్ డౌన్ ఎత్తేయడం సరైనది కాదని ఎపిడమాలజిస్టులు సూచించినా.. అవేవీ పట్టించుకోకుండా చైనా ఆంక్షలను సడలించింది. సింప్టమ్స్ లేకుండా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చిన వారి నుంచి వైరస్ వ్యాపించే అవకాశం ఉందని నిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే వైరస్ వచ్చి రికవర్ అయ్యిన వారికి మళ్లీ వైరస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని, అదే పరిస్థితి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పారు.

గుంపులు గుంపులుగా సొంతూళ్లకు
బుధవారం లాక్ డౌన్ ను ఎత్తేయగానే వేలాది మంది సొంతూర్లకు బయలుదేరి వెళ్లారు. ట్రైన్లు, బస్సులు ఫుల్ అయిపోగా.. ఎక్స్ ప్రెస్ వేలపై టోల్ గేట్ల వద్ద కార్లు బారులు తీరాయి. ఎక్కువ శాతం మంది సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. చాలా సంస్థలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. గత 15 రోజులుగా వూహాన్ లో 4 లక్షల వాహనాలు మాత్రమే తిరిగితే.. బుధవారం వాటి సంఖ్య 18 లక్షలకు చేరింది. 55 వేల మంది వరకూ ట్రైన్ల ద్వారా ఊర్లకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వూహాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లను నడుపుతున్నారు. బుధవారం 200 విమానాలు రాకపోకలు సాగించాయి. ఫ్లైట్ క్రూ మాస్క్ లు, గ్లౌజులు, గాగుల్స్ తో డ్యూటీ చేశారు.