నాటో కూటమికి వ్యతిరేకంగా చైనా, రష్యా దోస్తాన్

నాటో కూటమికి వ్యతిరేకంగా చైనా, రష్యా దోస్తాన్
  • బీజింగ్​లో పుతిన్, జిన్ పింగ్ భేటీ 
  • అమెరికా ఆధ్వర్యంలోని నాటోకు వ్యతిరేకంగా గళం 
  • తమ ఫ్రెండ్షిప్​కు లిమిట్స్ లేవంటూ ప్రకటన
  • వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న నేతలు

బీజింగ్: అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమికి వ్యతిరేకంగా చైనా, రష్యా జట్టు కట్టాయి. రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ కు లిమిట్స్ లేవని, అన్ని రంగాల్లోనూ పరస్పరం సహకారం అందించుకుంటామని ప్రకటించాయి. గురువారం బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలూ కలిసి పలు అంశాలపై చర్చించారు. కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, ఉక్రెయిన్​ను నాటో కూటమిలో చేర్చుకునేందుకు అమెరికా ప్రయత్నించడం, దానిని రష్యా వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ బార్డర్ లో లక్షకు పైగా బలగాలను మోహరించడంతో కొన్నిరోజులుగా టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యాలు కలిసికట్టుగా గళంమెత్తుతున్నాయి. 

ఆకస్ కూటమిపైనా గరం 
చైనాతో గతంలో ఎన్నడూ లేనంతగా సంబంధా లు పెరిగాయన్నారు. రష్యా నుంచి 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్​ను చైనాకు సరఫరా చేసేందుకు ఓ కాంట్రాక్టును కూడా సిద్ధం చేశామని పుతిన్ చెప్పారు. నిరుడు ప్రారంభమైన ఆకస్(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) కూటమి పట్ల కూడా పుతిన్, జిన్ పింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూక్లియర్ సబ్ మెరైన్ ల నిర్మాణంతో ఆసియా పసిఫిక్ రీజియన్​లో సెక్యూరిటీ పటిష్టం చేసేందుకు ఈ కూటమిని ప్రారంభిస్తున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి. కానీ.. దక్షిణ చైనా సముద్రంపై తమ ఆధిపత్యానికి గండికొట్టేందుకే ఆకస్ ప్రారంభమైందని డ్రాగన్ కంట్రీ ఆందోళన చెందుతోంది. చైనా ప్రకటించిన ‘వన్ చైనా’ పాలసీకి కూడా రష్యా మద్దతు ప్రకటించింది. తైవాన్ తమ దేశం నుంచి విడిపోయిన ఒక ప్రావిన్స్ అని, క్రమంగా దానిని తమ దేశంలో కలిపేసుకుంటామంటూ చైనా ఈ పాలసీని తెచ్చింది. 

పలు దేశాల తీరుకు ఖండన 
డోపింగ్ స్కాండల్ కారణంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో రష్యన్ అథ్లెట్లు తమ దేశ జెండాతో ఆడేందుకు వీలులేదు. అందుకే ఆయా ఈవెంట్లకు రష్యన్ అధికారులు కూడా అఫీషియల్​గా హాజరయ్యే అవకాశంలేదు. కానీ.. ఆతిథ్య దేశం ఆహ్వానిస్తే మాత్రం హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో చైనా ప్రెసిడెంట్ ఆహ్వానంమేరకు పుతిన్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనను సాకుగా చూపుతూ అనేక దేశాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ను బాయ్ కాట్ చేయడాన్ని కూడా ఇరు దేశాలు ఖండించాయి.

ఉక్రెయిన్ పేరు ఎత్తకుండానే.. 
రష్యాపై ఆధిపత్యం చెలాయించేందుకే నాటో కూటమి ద్వారా వెస్ట్రన్ కంట్రీస్ ప్రయత్నాలు చేస్తున్నాయని పుతిన్ మండిపడ్డారు. గతంలో సోవియెట్ యూనియన్​లో భాగమైన ఉక్రెయిన్, రష్యాను ఒక్కటిగానే భావిస్తామని, ఉక్రెయిన్​ను ఆక్రమించుకునే ఉద్దేశంలేదని ఇదివరకే స్పష్టంచేశారు. అయితే ఉక్రెయిన్ ప్రస్తావన చేయకుండానే నాటో కూటమి విస్తరణ కాంక్షను వ్యతిరేకిస్తున్నామని చైనా, రష్యా ప్రెసిడెంట్లు తాజాగా బీజింగ్​లో ప్రకటించారు. నాటో కోల్డ్ వార్ ఐడియాలజీని అనుసరిస్తోందని ఆరోపించారు. రష్యా, చైనా మధ్య ఫ్రెండ్షిప్​కు లిమిట్స్ లేవని, ఇకపై రెండు దేశాలు సహకరించుకోని రంగమనేదే ఉండదని అన్నారు. ఉక్రెయిన్​తో చైనాకు రాజకీయంగా, ఆర్థికంగా మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఈ ప్రకటనలో ఆ దేశం పేరెత్తకుండా చైనా జాగ్రత్తగా వ్యవహరించింది. ఒకవేళ ఉక్రెయిన్​పై రష్యా దాడి చేస్తే మాత్రం.. జిన్ పింగ్ తీసుకున్న ఈ స్టాండ్ కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.