చంద్రుడిపై కూలనున్న రాకెట్

చంద్రుడిపై కూలనున్న రాకెట్
  • తమది కాదని తేల్చేసిన చైనా

బీజింగ్: చంద్రుడి ఉపరితలంపై మార్చి 4న ఓ రాకెట్​ కూలిపోతుందని స్పేస్​ సైంటిస్టులు వెల్లడించారు. ఈ రాకెట్​ చైనా చేపట్టిన లూనార్​ ఎక్స్​ప్లొరేషన్​ ప్రోగ్రాంలో ఏర్పడిన స్పేస్​ జంక్​కు చెందిందని ఆరోపించారు. తొలుత దీనిని స్పేస్​ఎక్స్​ ప్రయోగం తర్వాత అంతరిక్షంలో వదిలేసిన రాకెట్​గా భావించామని చెప్పారు. అయితే, అది స్పేస్​ఎక్స్​ రాకెట్​ కాకపోవచ్చని, 2014లో చైనా ప్రయోగించిన రాకెట్​ బూస్టర్​ అయి ఉంటుందని తాజాగా వెల్లడించారు. లూనార్​ ఎక్స్ ప్లొరేషన్​ ప్రోగ్రాంలో భాగంగా 2014లో ప్రయోగించిన ఛేంజ్​5-టి 1 రాకెట్ బూస్టర్​ ఇదేనని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అది చంద్రుడివైపు దూసుకెళుతోందని, వచ్చే నెల 4న క్రాష్​  అవుతుందని చెప్పారు. అయితే, ఈ వాదనను చైనా కొట్టిపారేసింది. స్పేస్​లోకి పంపించే రాకెట్ల విషయంలో అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఛేంజ్​ 5–టి1 రాకెట్​ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. ఆ రాకెట్​తో పంపిన బూస్టర్​ తర్వాత భూవాతావరణంలోకి వచ్చి పేలిపోయిందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. తాజాగా చంద్రుడిపై కూలిపోనున్న రాకెట్​తో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పింది.