బుల్లెట్ రైల్ టెక్నాలజీతో.. ఎగిరే కార్లు

బుల్లెట్ రైల్ టెక్నాలజీతో..  ఎగిరే కార్లు

గాల్లో వాహనాలు ఎగరడాన్ని మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసి ఉంటాం. కానీ ఆ ఊహను నిజం చేసే పనిలో చైనా నిమగ్నమైంది. గాలిలో వాహనాలు ఎగిరేందుకు ఉన్న సాంకేతిక, యాంత్రిక ఆటంకాలను అధిగమించే దిశగా డ్రాగన్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా  సౌత్ వెస్ట్ జియావోటాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గతవారం జియాంగ్సు పట్టణంలోని హైవేపై కార్లను టెస్టింగ్ చేసింది. ఒక్కోటి దాదాపు 2.8 టన్నుల బరువున్న  8 సెడాన్ కార్లతో ఈ ప్రయోగం జరిపింది. ఇందుకోసం ఆ కార్లను యాంత్రికంగా, సాంకేతికంగా పూర్తిగా మోడిఫై చేశారు. దీంతోపాటు కార్ల టెస్టింగ్ కోసం జియాంగ్సు పట్టణ హైవేపై మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో  8 కిలోమీటర్ల పొడవునా ప్రత్యేక ట్రాక్ వేశారు.  

మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని సంక్షిప్తంగా మాగ్లెవ్ అని కూడా పిలుస్తారు. ఈ టెక్నాలజీతోనే ప్రస్తుతం  దక్షిణ కొరియా, చైనా, జపాన్ దేశాల్లో బుల్లెట్ రైళ్లు నడుస్తున్నాయి. బుల్లెట్ రైళ్లు గంటకు దాదాపు 600 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయంటే అందుకు కారణం మాగ్లెవ్ టెక్నాలజీయే. ఈ పరిజ్ఞానంతో తయారైన మాగ్నెటిక్ ట్రాక్ పై అయస్కాంత క్షేత్రం నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది. ఇది తన మీదుగా వెళ్లే వాహనాలను ముందు వైపునకు తోసేస్తుంది. ఫలితంగా ఆ వాహనం వేగం గణనీయంగా పెరుగుతుంది.  

కార్లను గాల్లో ఎగిరేలా చేసేందుకు జరుపుతున్న ప్రయోగాలకు మాగ్లెవ్ టెక్నాలజీనే చైనా సైంటిస్టులు వాడుతున్నారు.  మాగ్నెటిక్ ట్రాక్ పై 35 మిల్లీ మీటర్ల ఎత్తు నుంచి కార్లు ఎగురుతూ వెళ్లగలుగుతాయా ? లేదా ? అనేది పరీక్షించారు. అయితే ఆశ్చర్యకరంగా వీటిలో ఒక కారు ట్రాక్ మీదుగా గాల్లో ఎగురుతూ గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కాగా, గతేడాది చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్  పరిధిలోని క్వింగ్ డావో పట్టణంలో ఒక మాగ్లేవ్ బుల్లెట్ ట్రైన్ సేవలను ప్రారంభించారు. ఆ ట్రైన్ గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.