అమెరికాకు చైనా ప్రెసిడెంట్​ వార్నింగ్

అమెరికాకు చైనా ప్రెసిడెంట్​ వార్నింగ్

బీజింగ్: చైనా సావరినిటీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని, ఎంతవరకైనా వెళతామని ఆ దేశ ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ స్పష్టం చేశారు. తైవాన్ ముమ్మాటికీ తమ భూభాగమేనని, దానిని తమ నుంచి విడదీసేందుకు ప్రయత్నించే వారిని వదిలిపెట్టబోమని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ను హెచ్చరించారు. తైవాన్​ జోలికి రావడమంటే నిప్పుతో చెలగాటమేనని, మాడి మసైపోతరని వార్నింగ్​ ఇచ్చారు. ఈమేరకు మంగళవారం అమెరికా ప్రెసిడెంట్​తో జరిగిన వర్చువల్​ మీటింగ్​లో జిన్​పింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా తమ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జిన్​పింగ్​ చాలాసేపు మాట్లాడారు. తన స్పీచ్​లో చాలా అంశాలను ప్రస్తావించి, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

టెన్షన్లు రెచ్చగొట్టద్దు..

అమెరికా సాయంతో స్వాతంత్ర్యం పొందాలని తైవాన్​ చేస్తున్న ప్రయత్నాలు, తైవాన్​ను అడ్డుకుని తమ దేశాన్ని ఇరుకున పెట్టాలని కొంతమంది అమెరికన్లు చేస్తున్న ప్రయత్నాలు తమకు తెలుసని జిన్​పింగ్​ చెప్పారు. ఆ ప్రయత్నాలు బార్డర్లలో వాతావరణాన్ని రెచ్చగొడతాయని, దేశాల మధ్య సంబంధాలనూ దెబ్బతీస్తాయని జిన్​పింగ్​ ఇండైరెక్ట్​గా హెచ్చరించారు. ‘ప్రపంచంలో ఒక్కటే చైనా ఉంది.. తైవాన్​ అందులో భాగం. ఈ భూభాగం మొత్తం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్​ చైనా ప్రభుత్వ పాలన కింద ఉంది. అఖండ చైనా సాధనే ప్రతీ ఒక్క చైనీయుడి కోరిక. శాంతియుతంగానే చైనా మొత్తం ఒక్కటి కావాలని కోరుకుంటున్నాం.. తైవాన్​కు స్వాతంత్ర్యం కావాలంటూ రెచ్చగొట్టే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అని జిన్​పింగ్​ తెలిపారు.

ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడు..

చైనాకు జీవితకాల ప్రెసిడెంట్​గా కొనసాగేందుకు పార్టీ ప్లీనంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్న జిన్​పింగ్.. ఇప్పుడు ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.  చైనా లీడర్​గా 40 కోట్లకు పైగా జనాలకు సేవ చేయడం, వారితో కలిసి పనిచేయడం గొప్ప బాధ్యత. దీనిని నెరవేర్చే క్రమంలో తన సొంత బాగోగులనూ పట్టించుకోబోనని జిన్​పింగ్​ వివరించారు. రెండు దేశాల మధ్య విభేదాలు సహజమేనని, వాటిని సున్నితంగా డీల్​ చేయాలని చెప్పారు. అమెరికా, చైనాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా చేయాలని పిలుపునిచ్చారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ, శాంతియుతంగా అభివృద్ధివైపు కలిసి అడుగులేయాలని జిన్​ పింగ్​ కోరారు.