ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేద్దాం

ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేద్దాం
  • బైడెన్ కు చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ పిలుపు

బీజింగ్/వాషింగ్టన్: ప్రపంచ శాంతి కోసం అమెరికా, చైనా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పై భీకర యుద్ధం చేస్తున్న రష్యాకు సాయం చేయొద్దని జిన్ పింగ్ ను అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కోరారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంపై శుక్రవారం బైడెన్, జిన్ పింగ్ సుమారు రెండు గంటల పాటు వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎవరూ కోరుకోలేదని, దీనితో ఎవరికీ లాభం లేదని జిన్ పింగ్ అన్నారు. అతర్జాతీయ బాధ్యతలను రెండు దేశాలూ భుజాలకు ఎత్తుకోవాలని, ప్రపంచంలో శాంతి కోసం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా జిన్ పింగ్ పిలుపునిచ్చారని చైనీస్ ప్రభుత్వ మీడియా సంస్థ చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) వెల్లడించింది. ‘‘ చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకునేందుకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. మరింత మంది చనిపోకూడదు. సంక్షోభం తలెత్తకూడదు. యుద్ధం త్వరగా ముగిసిపోవాలి. ఇందుకోసం రష్యాతో అమెరికా, నాటో దేశాలు కూడా చర్చలు జరపాలి’’ అని జిన్ పింగ్ కోరినట్లు తెలిపింది. ఏ దేశాల మధ్య అయినా సంబంధాలు యుద్ధానికి దారితీయొద్దని ఆయన అభిప్రాయపడ్డారని చెప్పింది.   

రష్యాకు హెల్ప్ చేయొద్దు.. 

రష్యాకు సాయం చేయొద్దని జిన్ పింగ్​ను బైడెన్ కోరారు. ఉక్రెయిన్​పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్న వెస్ట్రన్ కంట్రీస్ కు మద్దతు తెలపాలని జిన్ పింగ్​పై ప్రెజర్ తెచ్చేందుకే బైడెన్ ఫోన్ చేసినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఈ విషయంపై వాళ్లు చర్చించారా లేదా అనేది తెలియరాలేదు.